
TSPSC Paper Leak: టిఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు గ్రూప్_1 ప్రిలిమ్స్ లో 103 మార్కులు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ నియాంశమవుతోంది. నిజానికి పరీక్ష రాసే సమయంలో ప్రవీణ్ తన ఓఎంఆర్ షీట్ పై బుక్ లెట్ నెంబర్ తప్పుగా బబ్లింగ్ చేయడంతో అతని పేపర్ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అతడిని డిస్ క్వాలిఫై చేశారు. అయితే లీకేజీ వ్యవహారం బయటకి రావడంతో అతడికి ఎన్ని మార్కులు వచ్చాయని ఆసక్తి అందరిలోనూ కలిగింది. “కీ” పరిశీలించగా 103 మార్కులు వచ్చినట్టు తేలడంతో అంతా ఆశ్చర్యపోయారు.
సాధారణంగా గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా సీరియస్ గా చదువుతారు. నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆరు నెలల నుంచి దాదాపు ఏడాది పాటు కోచింగ్ తీసుకుంటారు. ఇతర పనులను పక్కనపెట్టి ఇదే పనిలో ఉంటారు. అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారైతే ఈ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు కొంతకాలం పాటు సెలవు పెడతారు. చదువుకుంటారు. ఇంత కష్టపడినప్పటికీ చాలామందికి 70 నుంచి 80 మార్కులు మాత్రమే వచ్చాయి. చాలా సీరియస్ గా చదివిన వారికి కూడా వంద మార్కులకు మించి రాలేదని అభ్యర్థులు అంటున్నారు. అలాంటిది ఒక్కరోజు ఉద్యోగానికి సెలవు పెట్టకుండా, ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా పరీక్ష రాసిన ప్రవీణ్ కు ఇన్ని మార్కులు వచ్చేందుకు కారణం పేపర్ లీకేజీ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పేపర్ ఆధారంగా ప్రవీణ్ ఒక్కడే చదివి పరీక్ష రాశాడా? లేక లీగైన పేపర్‌ను మరి ఇంకెవరికైనా అందించాడు అనే కోణంలో చర్చ జరుగుతోంది. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక ప్రవీణ్ లీకేజ్ చేసిన ఏ ఈ పరీక్షను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో చెబుతామని వివరించింది. మునిసిపల్ పరిపాలన విభాగంలో ఖాళీగా ఉన్న ఈ 837 అసిస్టెంట్ ఇంజనీర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఈనెల 5న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ పోస్టుల కోసం మొత్తం 74,478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 162 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పేపర్ _1 కి 55189 మంది, పేపర్_2 కు 54,917 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ లీక్ అయిన కారణంగా ఈ పరీక్ష రద్దయింది.