Telugu News » News » Ravi shastris tears were shed sunil gavaskar did that
Nitish Kumar Reddy: రవి శాస్త్రి కన్నీరు కార్చితే.. సునీల్ గవాస్కర్ ఆ పని చేశాడు.. నితీష్ కుమార్ రెడ్డికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం ఇదీ.. వైరల్ వీడియో
Nitish Kumar Reddy: ఏ ముహూర్తాన మెల్ బోర్న్ మైదానంలో సూపర్ సెంచరీ చేశాడో తెలియదు గానీ.. నితీష్ కుమార్ రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సోషల్ మీడియా నుంచి మీడియా వరకు అతడి పేరే వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాలలో అయితే అతని ఏకంగా విస్తృతమైన చర్చనీయాంశమైన వ్యక్తుల జాబితాలో చేరిపోయాడు.
Nitish Kumar Reddy: సూపర్ సెంచరీ చేయడంతో నితీష్ కుమార్ రెడ్డి పై మీడియా సంస్థలు రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఎక్కడో విశాఖపట్నంలో పుట్టిన అతడు ఇక్కడ దాకా ఎదగడం .. ఇంతటి పేరు తెచ్చుకోవడం వెనుక పడిన కష్టాలను పుంఖాను పుంఖాలుగా చెబుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నితీష్ కుమార్ రెడ్డి పై చర్చ మొదలైంది. దీంతో నెట్టింట అతని గురించి పలువురు శోధిస్తున్నారు. అతడి వివరాల గురించి తెలుసుకుంటున్నారు. సూపర్ సెంచరీ సాధించిన తర్వాత కామెంట్రీ బాక్స్ లో ఉన్న రవి శాస్త్రి కన్నీటి పర్యంతమయ్యాడు. అతడు సూపర్ సెంచరీ సాధించిన తర్వాత ఇర్ఫాన్ పఠాన్ హిందీలో కామెంట్రీ చేస్తుంటే.. అలా వింటూ.. కన్నీటిని కారుస్తూనే ఉన్నాడు రవి శాస్త్రి. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత.. టీమిండియా మళ్ళీ ఆస్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. కీలక ఆటగాళ్లు జైస్వాల్, రాహుల్ మినహా మిగతావారంతా తేలిపోతున్నారు. ఇది సహజంగానే మాజీ క్రికెటర్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.. ఆవేదనను కలిగిస్తోంది. మెల్ బోర్న్ టెస్ట్ లోనూ టీమిండియా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడం.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో.. ఇక్కడ కూడా ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. కానీ వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి పరిస్థితిని ఒక్కసారిగా మార్చేశారు. చూస్తుండగానే కొండంత లక్ష్యాన్ని కరిగించారు. అది సీనియర్ క్రికెటర్లకు అద్భుతంగా అనిపించింది. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు రవి శాస్త్రి కన్నీటి పర్యంతమయ్యాడు. భావోద్వేగానికి గురయ్యాడు. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి ని ఉద్దేశిస్తూ.. ఇది పుత్రోత్సాహం అని కొనియాడాడు.
సునీల్ గవాస్కర్ ఏం చేశాడంటే..
రవి శాస్త్రి నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ చూసి కన్నీటి పర్యంతమైతే.. మరో ఆటగాడు సునీల్ గవాస్కర్ సంచలనానికి నాంది పలికాడు. సాధారణంగా సునీల్ గవాస్కర్ ఎంత గొప్పగా ఆడినా.. క్రికెటర్లను అభినందించడు. గొప్పగా ఆడారు అంటూ కితాబు కూడా ఇవ్వడు. ఎందుకంటే పొగడ్తనేది అహాన్ని పెంచుతుందని సునీల్ గవాస్కర్ నమ్మకం. అందువల్లే ఆయన పొగడ్తలను.. ప్రశంసలను వ్యక్తీకరించడు. అయితే ఆయన వ్యక్తిత్వానికి భిన్నంగా శనివారం సూపర్ సెంచరీ చేసి అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేకాదు అతడు సెంచరీ చేసి.. మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూమ్ వైపు వస్తున్నప్పుడు.. స్టాండింగ్ ఓ వేషన్ ఇచ్చాడు. ఈ తరహా గౌరవాన్ని సునీల్ గవాస్కర్ ఇంతవరకు ఏ క్రికెటర్ కూ ఇవ్వలేదు. అక్కడదాకా ఎందుకు ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. దానిని సునీల్ గవాస్కర్ ఒక సాధారణ గెలుపు లాగానే చూసాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ తర్వాత.. అతనిని చూసి కామెంట్రీ బాక్స్ లో లేచి నిలబడి.. తన గౌరవాన్ని చాటుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది. సీనియర్ క్రికెటర్లు రవి శాస్త్రి కన్నీరు పెట్టుకోవడం.. సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఓ తెలుగు ఆటగాడికి దక్కిన గౌరవం అని.. ఇది తెలుగు కీర్తిని రెపరెపలాడిస్తుందని మిగతా క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
మెల్ బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీ సాధించిన నేపథ్యంలో.. కామెంట్రీ బాక్స్ లో ఉన్న లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఓ వేషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #NitishKumarReddy#SunilGavaskar#BoxingDayTestpic.twitter.com/ov9GAQsAQv