KCR Double Game: తెలంగాణ రాజకీయాలు రోజుకో రంగును పులుముకుంటున్నాయి. దీంతో ప్రజలు కూడా చాలా అమోమయానికి గురవుతున్నారు. అసలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నిజంగానే దోస్తులా..? ఢిల్లీలో దోస్తానా.. గల్లీలో కొట్లాటలో ఎంతమేర నిజముందోనని ఆలోచిస్తున్నారు. ఇంతలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కొత్త దోస్తులయ్యాలని వార్తలు రావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొన్నటివరకు బీజేపీకి సపోర్టుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా తన స్టాండ్ మార్చుకుంది. నిన్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన విపక్ష పార్టీల మీటింగ్‌కు టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవ రావు హాజరయ్యారు. అది చూసి రాష్ట్ర ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కసారిగా అందరినీ గందరగోళంలో పడవేస్తున్నాయి.

కాంగ్రెస్‌తో దోస్తీ.. బీజేపీతో కుస్తీ
హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని అర్థం చేసుకోవచ్చు. మొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో క్రమంగా పెరుగుతుండటం, టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా డౌన్ అవుతుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌లో ఉండే కేసీఆర్ను బయటకు రప్పించామని, ధర్నా చౌక్ అవసరమే లేదన్న కేసీఆర్‌తో ఏకంగా ధర్నా చేసేలా చేశామని.. ఇది మా విజయమని బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు కేంద్రం రైతులను మోసం చేస్తుందని, యాసంగిలో వరి వేయాలా వద్దా అని చెప్పడం లేదని కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నాడు కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి తేల్చుకుని వస్తానని ఉత్తచేతులతో తిరిగొచ్చారు సీఎం సారూ..
బీజేపీతో యుద్దమే వెంటాడుతా..
జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ గెలవడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఇక్కడి బీజేపీ లీడర్లు చేస్తున్న కామెంట్స్‌ను కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. రానున్నరోజుల్లో బీజేపీతో యుద్దం చేస్తానని., ఒక్కొక్కరినీ వెంటాడుతామని మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడుతుందని కాంగ్రెస్ నాయకులు పదేపదే ప్రచారం చేస్తూ వచ్చారు. అయినా వారిని ప్రజలు పెద్దగా ఆదరించలేదు. కానీ తాజా పరిణామంతో టీపీసీసీ అధ్యక్షుడు కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్నారట..
Also Read: కేసీఆర్ టార్గెట్ బీజేపీ.. అసలు కారణం ఇదేనా?
ఒక్క దెబ్బతో రెండు పిట్టలు…
రాజ్యసభలో సస్పెండ్ అయిన ఎంపీలతో పాటు విపక్ష పార్టీలతో రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున కేకే హాజరయ్యారు. రాహుల్ గాంధీ పక్కనే కుర్చున్నారు. ఈ ఫోటోను ప్రస్తుతం బీజేపీ లీడర్లు హైలెట్ చేస్తున్నారు. ఇన్నిరోజులు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌తో దోస్తీ కోసమే టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీతో యుద్దం ప్రకటించిందని అందరికీ తెలుస్తోంది. అంతేకాకుండా లోకల్‌గా కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా, గులాబీ బాస్ ఈ స్కెచ్ వేసినట్టు తెలిసింది. అటు పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలతో బీజేపీ రైతు వ్యతిరేకి అని నిరూపించి.. ఇటు కాంగ్రెస్ పార్టీతో నయా దోస్తీతో లోకల్ లీడర్స్ బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పుకుని ఎదగకుండా చేసేందుకు కేసీఆర్ కొత్త స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో మళ్లీ మైలేజ్ సంపాదించుకోవాలని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.