Karthika Masam: కార్తీక మాసం శివుడికి అత్యంత ముఖ్యమైనది. అభిషేక ప్రియుడైన శివుడు ఈ మాసంలో విశేషమైన పూజలు అందుకుంటాడు. ధూపాలతో, దీపాలతో ప్రత్యేక శోభను సంతరించుకుంటాడు. కాశీ మించి మొదలు పెడితే మారుమూల గ్రామంలో ఉన్న శివాలయం వరకు నిత్య పూజలతో మారుమోగుతూ ఉంటుంది. నది తీరాన క్షేత్రాలలో అయితే భక్తులు దీపాలను వదులుతుంటారు. ఉసిరి చెట్టుకు పూజలు చేస్తుంటారు. శివుడికి కొబ్బరికాయలు కొట్టి.. పాలు, నెయ్యి, బెల్లం, సుగంధ ద్రవ్యాలు, గోధుమ రవ్వతో తయారుచేసిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెడతారు. ఇక కొన్ని శైవ క్షేత్రాలలో ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తుంటారు. తెలుగు నాట ప్రముఖమైన శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట ప్రాంతాలలో ప్రత్యేకంగా పూజలు జరుపుతుంటారు. శివుడికి పూజలు చేసే విధానంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో వైవిధ్యం ఉంటుంది. ఈ ప్రాంతాలకు చారిత్రాత్మకమైన ఐతిహ్యం కూడా ఉంది. దీని వెనక ఎన్ని చారిత్రాత్మకమైన గాధలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. భక్తులు శివుడిని విశేషంగా కొలుస్తుంటారు.. కార్తీక మాసం సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. శివుడికి పూజలు, అభిషేకాలు నిర్వహించి.. కోరిన కోరికలు నెరవేరేలా చూడాలని మొక్కుతుంటారు. మనుషులు చేసే పూజలు శివుడికి సర్వసాధారణమే అయినప్పటికీ.. కార్తీక మాస సందర్భంగా తెలంగాణలోని కీసరగుట్ట ప్రాంతంలో ఓ వానరం చేసిన పూజలు మాత్రం ఆకట్టుకున్నాయి.
హృదయాంతరాళం లోకి ఆహ్వానించాలి
కార్తీక మాసం సందర్భంగా శివుడికి పూజలు చేయడం సర్వసాధారణం. దీపాలు వెలిగించడం నిత్య కృత్యం. కానీ శివుడికి కార్తీకమాసంలో వీటన్నింటి కంటే చేయాల్సినవి చాలా ఉన్నాయట. భక్తులు స్వామి వారికి నిష్ట పూజలు చేయాలట. ఆయనను హృదయాంతరాళంలోకి ఆహ్వానించాలట.. ఈ విషయాలన్నీ శివపురాణంలో ఉన్నాయి. మార్కండేయుడు నుంచి కన్నప్ప వరకు వృత్తాంతాలు అందులో ఉన్నాయి. అయితే వాటన్నింటికి భిన్నంగా.. ఓ వానరం శివుడికి పూజలు చేసింది . ఆ పూజల్లో హంగు లేదు. ఆర్భాటం అంతకన్నా లేదు. దేదీప్యమానంగా వెలిగిన జ్యోతులు లేవు. నాలుక లో లాలాజలాన్ని ఊరించే నైవేద్యాలు లేవు. ఏముందంటే.. శివుడి మీద భక్తి ఉంది. అతడిని గుండెలకు హత్తుకునే ఆప్యాయత ఉంది. అన్నింటికి మించి ఎటువంటి కోరికలు కోరని నిర్మలత్వం ఉంది. అదే ఆ వానరాన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఈ దృశ్యాన్ని ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త చర్చకు దారితీస్తోంది.. ఆ దృశ్యాన్ని చూస్తే కన్నప్ప శివలింగాన్ని హత్తుకున్నట్టే ఉంది. అందుకే అంటారు భక్తి అంటే మూఢత్వాన్ని కాకుండా నిర్మలత్వాన్ని ప్రదర్శించాలని.. ఆ వానరం కూడా మనుషులకు చెబుతోంది అదే. ఆ వానర భక్తిని చూసి మనుషులు నేర్చుకోవాల్సింది కూడా అదే.. ఆ వానరం శివుడికి పూజలు చేసింది.. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయింది.. చివరికి అక్కడ ఉన్న కొబ్బరి చిప్పను కూడా ముట్టుకోలేదు.