కమలా హారిస్ ని జోడీగా బైడెన్ ఎన్నిక చేసుకోవటం అమెరికాలోని భారతీయ అమెరికన్ల తో పాటు , మనకు కూడా ఎంతో వుత్తేజాన్నిచ్చింది. దానికి కారణం లేకపోలేదు. అమెరికా ప్రపంచం లోనే శక్తివంతమైన ధనిక దేశం. అటువంటి దేశానికి ఇంతత్వరలో భారతీయ మూలాలున్న వ్యక్తి ఉపాధ్యక్ష స్థాయి పదవికి పోటీ పడతారని ఎవరూ ఊహించలేదు. ఇంతవరకు 100 మంది సభ్యులుగా వుండే సెనేట్ లో కూడా మొట్టమొదటగా భారతీయ మూలాలున్న వ్యక్తి గా కమలా హారిస్ ప్రవేశించి రికార్డు సృష్టించింది మూడు సంవత్సరాల క్రితమే. ఇంతలోనే దేశంలోనే రెండో వున్నత పదవికి పోటీపడే అవకాశం వస్తుందని ఊహించని విషయమే. ఈ సంవత్సరపు అధ్యక్ష డెమోక్రటిక్ అభ్యర్ధుల పోటీలో కమలా హారిస్ పోటీ చేసినా మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చింది.
Also Read: వైరల్: పిల్లి నాకడంతో మహిళ మృతి.. ఎక్కడంటే?
దానితో తను నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ప్రైమరీల వరకు నిరీక్షించవలసిందేనని, ఆ తర్వాత కూడా ఏమి జరుగుతుందో తెలియని భవిష్యత్తు గా తన పరిస్థితి వుంది. ఆ అనిశ్చిత స్థితి నుంచి ఒక్కసారి ఉపాధ్యక్ష పదవి అభ్యర్ధిగా పోటీ చేయటం , గెలిస్తే ( గెలిచే అవకాశాలు ఎక్కువగా వున్నాయి) వచ్చే ఎన్నికలకి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్షపదవికి పోటీ చేసే అవకాశాలు మెండుగా వుండటం తో భారతీయులకు, మీడియా కు సహజంగానే ఉద్వేగభరిత సంఘటనే. ఎన్ టి ఆర్ ఏదో ఒక సందర్భం లో తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు గా ఎన్నిక కావాలని అన్నట్లు గుర్తు. తెలుగువాడు కాకపోయినా ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి, అదీ ఒక మహిళ భవిష్యత్తులో అధ్యక్షురాలయ్యే అవకాశాలు ఊహించుకున్నామా? ఇది నిజంగా ఉద్వేగభరిత క్షణాలే ప్రతి భారతీయుడికి.
కమలా హారిస్ భారతీయ మూలాలు, వ్యక్తిత్వం
కమలా హారిస్ పుట్టింది శాన్ ఫ్రాన్సిస్కో కి జంటనగరంగా వున్నఓక్ ల్యాండ్ లో. ఓక్ ల్యాండ్ లో నల్ల జాతీయులు ఎక్కువగా వుంటారు. తన తండ్రి జమైకా కి చెందిన నల్ల జాతీయుడైనా తను పుట్టిన 7 సంవత్సరాలకే తల్లి శ్యామల తో విడాకులు తీసుకోవటంతో తను, తన సోదరి మాయ తల్లి పెంపకం లోనే పెరిగారు. చిన్నప్పుడు రెండు సంవత్సరాల కొకసారి తాత, అమ్మమ్మ లతో గడపటానికి అందరూ కలిసి చెన్నై వచ్చేవారు. కేంద్రప్రభుత్వ అధికారి అయిన తాత గోపాలన్ తో కమలా అనుబంధం ఎక్కువని తనే ఇంతకుముందు చెప్పుకుంది. తన మేనమామ బాలచంద్రన్ ( తల్లి సోదరుడు) డిల్లీలో కేంద్ర రక్షణ శాఖ లో ఉద్యోగి. చెన్నై లో కమలా తాత తరఫు కుటుంబ సభ్యులు వుండనేవున్నారు. ఏ విధంగా చూసినా భారత్ తో కుటుంబ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. భారతీయ వంటకాలు, సంస్కృతి తో కూడా అమ్మ ద్వారా బాగానే పరిచయం వుంది.
కానీ అమెరికా మీడియా లో ఎక్కువగా తను నల్ల జాతీయురాలిగానే గుర్తింపు పొందింది. దానికి కారణం అందరికీ తెలిసిందే. అమెరికా ఓటర్లలో అలా అయితేనే ఎన్నికల్లో ఉపయోగముంది. భారతీయ అమెరికన్లు అమెరికా ఎన్నికల్లో ప్రభావితం చేసేటంతగా లేరు. కమలా హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ గా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేసింది. నిర్ణయాలు తీసుకోవటం లో గట్టిగానే ఉంటుందని పేరొచ్చింది. దానిపైనే పార్టీ లో కొంతమంది ‘వామపక్ష ఉదారవాదులు’ ఆమెను ఎన్నుకోవటం పై పెదవి విరచారని తెలుస్తుంది. అది ఒకవిధంగా జనరల్ ఓటర్లలో ప్లస్ పాయింట్ గానే చూడాల్సి వుంది. గత మూడు సంవత్సరాల్లో సెనేటర్ గా తన రికార్డ్ బాగా వుంది. జార్జి ఫ్లాయిడ్ ఉదంతం లో గట్టిగా నిరసనలు తెలపటం, నేర న్యాయ చట్టాల్లో సమూల మార్పులు రావాలని కోరటం డెమోక్రాట్ల లో తన ఇమేజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇంతవరకూ అమెరికా లో ఒక మహిళ అధ్యక్షురాలు కాలేకపోవటం శోచనీయం. కమలా హారిస్ ఎన్నికయితే వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి బైడెన్ కి 82 సంవత్సరాలు దాటుతాయి. తిరిగి పోటీ చేసే అవకాశాలు దాదాపుగా లేనట్లే. కమలా హారిస్ కనక 2024 ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికయితే ఎన్నో రికార్డులు స్వంతం చేసుకుంటుంది. మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా, మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ ( నల్ల జాతీయురాలు)గా, మొట్టమొదటి భారతీయ అమెరికన్ గా, మొట్టమొదటి ఆసియన్ అమెరికన్ గా చరిత్ర సృష్టిస్తుంది. మామూలుగా అయితే ఉపాధ్యక్షుడి పదవి పై అంత ఉత్కంట వుండదు. ఇన్ని విధాలుగా ప్రభావం చేస్తుంది కాబట్టే ఈ సారి కమలా హారిస్ జోడీ పై ఇంత ఆసక్తి నెలకొంది.
భారత-అమెరికా సంబంధాల్లో మార్పులు ఎలా వుంటాయి?
ఇక గెలుపు అవకాశాలు చూస్తే ఈసారి బైడేన్-కమలా జోడీ గెలిచే అవకాశాలే మెండుగా వున్నాయి. కమలా హారిస్ ఎంపిక ‘గేమ్ చేంజర్’ గా చెప్పలేము కానీ ఒకవిధంగా ‘సేఫ్ గేమ్’ గా చెప్పొచ్చు. ఈసారి ఎన్నిక బైడేన్ మీద అనుకూలత కన్నా కరోనా మహమ్మారి ని ఎదుర్కోవటం లో ట్రంప్ పై వచ్చిన వ్యతిరేకత ప్రధానాంశంగా ముందుకొచ్చింది. కరోనా మహమ్మారి రాకుండా ఉన్నట్లయితే ట్రంప్ కే గెలుపు అవకాశాలు ఉండేవి. ఈ మహమ్మారి తో మొత్తం రాజకీయ వాతావరణం మారింది. ట్రంప్ మీద కోపం పెరిగింది. ఇదే చివరకు తన కొంప ముంచబోతుందని అనిపిస్తుంది.
Also Read: శరీరానికి నిప్పు అంటించుకొని ప్రపోజ్ చేశాడు.. చివరికి?
ఈ గెలుపుతో భారత- అమెరికా సంబంధాలు ఎలా వుండబోతున్నాయనేది ప్రతి భారతీయుడి మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. నా దృష్టిలో గుణాత్మక మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ పరిణామాలు చూస్తే అటు అమెరికాకి ఇటు భారత్ కి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాల్సిన అగత్యం వుంది. రెండు దేశాలకి చైనా వుమ్మడి శత్రువుగా తయారయ్యింది. ఒకనాడు సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా అమెరికా, చైనా దగ్గరయినట్లు ఇప్పుడు చైనా కి వ్యతిరేకంగా అమెరికా, భారత్ దగ్గరవుతాయి. ఏ పార్టీ గెలిచినా ఈ పరిస్థితుల్లో మార్పు వుండదు. ముఖ్యంగా భద్రత, వ్యాపారం , పరస్పర సంబంధాల్లో పార్టీలతో సంబంధం లేకుండా బంధం మరింత పటిష్టమవుతుంది. వలస విధానల్లోనే కొన్ని మార్పులు జరగొచ్చు. ముఖ్యంగా హెచ్ 1బి వీసాల విషయం లో కొంత సడలింపులు జరుగుతాయి. శాశ్వత నివాసం ( గ్రీన్ కార్డు) విషయం లో చెప్పలేము. ఇది అధ్యక్షుడి కన్నా అమెరికా కాంగ్రెస్ విధానం పైనే ఎక్కువ ఆధారపడివుంది. ఈసారి ప్రతినిధుల సభ, సెనేట్ రెండూ డెమోక్రాట్లు మెజారిటీ తెచ్చుకుంటే ఏమైనా మార్పులు జరగవచ్చునేమో. అదికూడా చెప్పలేము. వలస విధానం లో పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతినిధులు , సెనేటర్లు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఈ ఎన్నికతో పరిస్తితు ల్లో మార్పు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము.
కమలా హారిస్ విధానాలు ఎలా వుండబోతున్నాయి?
మరి కమలా హారిస్ ఉపాధ్యక్ష ఎన్నిక తో ఏమైనా మార్పులు జరిగే అవకాశముందా అంటే లేదనే చెప్పాలి. అసలు ఉపాధ్యక్షురాలు విధానపర నిర్ణయాలు తీసుకోలేదు. అది అధ్యక్షుడి మీదే ఆధారపడి వుంటుంది. బైడేన్ స్వతహాగా విదేశీ వ్యవహారాల నిపుణుడు. భారత్ కి అనుకూలుడుగానే పేరుంది. దానికి భారతీయ మూలాలున్న కమలా హారిస్ చేరిక కొంత వుపయోగపడొచ్చు. కానీ స్థూలంగా చూస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాం లోనే భారత-అమెరికా సంబంధాలు మెరుగ్గా వున్నాయి. కమలా హారిస్ వరకూ మానవహక్కుల సమస్యను తీవ్రంగానే తీసుకుంటుంది. చైనా లో వీఘర్ ముస్లిం లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల పై తీవ్రంగా ప్రతిస్పందించింది. అదే సమయం లో కాశ్మీర్ లో మానవ హక్కుల పై కూడా ప్రతిస్పందించింది. చైనా ప్రభుత్వం పై స్పందించిన పద్దతి లో మాట్లాడకపోవటం గమనార్హం. గత యేడాది ఇంకో భారతీయ మూలాలున్న ప్రతినిధి ప్రమీల జయపాల్ – విదేశాంగ మంత్రి జయశంకర్ వివాదం లో ప్రమీల వైపు గట్టిగా నిలబడింది. స్థూలంగా చూస్తే భారత్ తో సంబంధాలు మెరుగు పరుచుకోవాలని కోరుకుంటుంది. అదేసమయం లో తనే వలసవాద తల్లిదండ్రులకు జన్మించింది కాబట్టి వలసవాద సమస్యలపై వారికి గట్టి మద్దత్తుదారుగా నిలబడింది. కమలా హారిస్ మిగతా అధ్యక్ష అభ్యర్ధుల లాగా రాడికల్ అభిప్రాయాలు లేవు. మధ్యే వాదిగానే చూడాల్సివుంది. మొత్తం మీద చూస్తే కమలా హారిస్ ఎన్నికయితే భారత్ కు శ్రేయోభిలాషిగా వైట్ హౌస్ లో ఉండటమే కాకుండా 2024 ఎన్నికల్లో మొట్టమొదటి భారతీయ సంతతిరాలు అధ్యక్షపీఠం పై కూర్చునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది భారతీయులందరికీ ఆనందం కల్గించే వార్త. వాస్తవానికి భారత్ పై అమెరికా స్థానిక ప్రజల్లో అవగాహన పెద్దగా లేదు. ఇటీవలి కాలం లోనే కొంత మెరుగయ్యింది. ఇప్పుడు కమలా హారిస్ భారతీయ మూలాలు ఉన్నాయనే సరికి భారత్ ని గురించి గూగుల్ లో వెదకటం ఎక్కువయ్యిందట. దీనితో భారత్ అమెరికా ప్రజలకి మరింత చేరువగా వచ్చింది. కమలా హారిస్ ఎంపిక ఆ విధంగా భారత్ ప్రతిష్ట పెంపుదలకు దోహదం చేసింది.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Kamala harris vice president candidate to biden
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com