heart attack death mystery : ఏడాది మార్చి.. 13వ తేదీ.. కాకినాడలోని సర్పవరంలో ఓ ఆసుపత్రికి తన భర్తను భార్య తీసుకొచ్చింది. గుండెపోటుతో ఇబ్బంది పడుతున్నాడని.. అపస్మారక స్థితికి చేరుకున్నాడని కన్నీరు మున్నీరయింది. ఆస్పత్రి వైద్యులు అతనికి చికిత్స మొదలుపెట్టారు. అప్పటికే అతడు చనిపోయాడని నిర్ధారించారు. భర్త చనిపోవడంతో భార్య గుండెలు పగిలేలా ఏడ్చింది.. ఆ తర్వాత అతడికి అంత్యక్రియలు జరిగాయి. సరిగ్గా మూడు నెలల తర్వాత మృతుడి కూతురి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది.
ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం..
ఆమె పేరు దేవి.. ఈమెకు సర్పవరం మండపం కాలనీకి చెందిన పుల్లా దుర్గాప్రసాద్ (38) తో చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దేవి, దుర్గాప్రసాద్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దుర్గాప్రసాద్ ఆటో తోలుకుంటూ జీవించేవాడు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం దుర్గాప్రసాద్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో వైద్యులు అతడి గుండెకు రెండు స్టంట్ లు వేశారు. అప్పటినుంచి దుర్గాప్రసాద్ ఇంటి వద్ద ఉంటున్నాడు. దేవి పనులకు వెళ్తోంది. దేవికి ఇన్ స్టా గ్రామ్ లో గోపి సాయి అనే యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
బాపట్ల నుంచి వచ్చేవాడు
గోపి సాయి బాపట్ల నుంచి వచ్చేవాడు. సర్పవరం లో దేవిని ఎక్కించుకొని.. విజయవాడ, రామచంద్రపురం ప్రాంతాలకు తీసుకెళ్ళేవాడు. దేవి వ్యవహారం అనుమానం కలిగించడంతో దుర్గాప్రసాద్ నిలదీశాడు. భార్యను ఫోన్ వాడకుండా అడ్డుకున్నాడు. దీంతో అడ్డుగా ఉన్నాడని భావించిన అతడిని అంతం చేయాలని దేవి నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని గోపి సాయితో చెప్పింది. దీంతో అతడు ఈ ఏడాది మార్చి 13న 15 నిద్ర మాత్రలు ఆమెకు ఇచ్చాడు. వాటిని ఆమె ఖర్జూర రసంలో వేసి భర్తకి ఇచ్చింది. ఆ రసాన్ని అతడు తాగి నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత గోపి సాయి దిండుతో అతడి ముఖం మీద అదిమి పట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా చేసి అంతం చేశాడు. ఈ నేపథ్యంలో తన భర్తకు గుండెపోటు వచ్చిందని దేవి కుటుంబ సభ్యులకు చెప్పింది. అప్పటికే వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతడు చనిపోయాడు.
ప్రియురాలిని పట్టించాడు
ఈ ఘటన జరిగిన తర్వాత దేవి గోపి సాయితో మాట్లాడడం తగ్గించింది. అతడిని పూర్తిగా పక్కన పెట్టింది. అయితే ఆమె వేరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో గోపి సాయి ఈ నెల 9న దేవి కుమార్తెకు మెసేజ్ చేశాడు. “మీ తండ్రి గుండెపోటుతో చనిపోలేదు..నేను, మీ అమ్మ కలిసి చంపేశాం. ఖర్జూర రసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాం” అని మెసేజ్ చేశాడు. దీంతో దేవి కుమార్తె ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ తమ్ముడికి చెప్పింది. అతడు ఈ నెల 9న సర్పవరం పోలీసులకు విషయాన్ని చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవి, గోపి సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారించగా అసలు విషయం చెప్పారు. వారిద్దరిని అరెస్ట్ చేసి.. రిమాండ్ కు పంపించారు.

