Balineni Sreenivasa Reddy : వైసీపీ సీనియర్ నేతల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. జగన్ కు బంధువు కూడా. 2014 ఎన్నికల్లో బాలినేని ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలిచారు. జగన్ తన తొలి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కీలక మంత్రి పదవిని కట్టబెట్టారు. ప్రభుత్వంలోనూ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు బాలినేని. అసలు తనను కొనసాగిస్తారని భావించారు. సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మాదిరిగా కొనసాగింపు ఉంటుందని అంచనా వేశారు. కానీ జగన్ షాక్ ఇచ్చారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలో కొనసాగించి.. బాలినేనిని తొలగించారు. అప్పటినుంచి బాలినేని అసంతృప్తి, అలకలు కొనసాగాయి. మరో పార్టీ ఆప్షన్ లేక.. వైసీపీలో మాట చెల్లుబాటు కాక బాలినేని ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నారు. అయితే ఫైనల్ గా ఇప్పుడు పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే పో అన్నట్టు జగన్ వైఖరి ఉంది. దీంతో ఏం చేయాలో బాలినేనికి పాలు పోవడం లేదు.
* దగ్గర బంధువైనా
వై వి సుబ్బారెడ్డి కి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు. జగన్ కు వైవి సుబ్బారెడ్డి స్వయానా బాబాయ్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి తో బాలినేనికి విభేదాలు ఏర్పడ్డాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితికి వచ్చింది. తనకు మంత్రి పదవి పోవడానికి వై వి సుబ్బారెడ్డి కారణమని బాలినేని భావించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవి పెత్తనం ఉండకూడదు అని షరతు పెట్టారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మా గుంట శ్రీనివాసుల రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని బాలినేని కోరారు. కానీ అందుకు జగన్ అంగీకరించలేదు.
* చెవిరెడ్డికి ప్రాధాన్యం
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించారు జగన్. ఈ నిర్ణయాన్ని బాలినేని వ్యతిరేకించారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టు పట్టారు. కానీ జగన్ అంగీకరించలేదు. దీంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలోకి వెళ్లిపోయారు. కానీ బాలినేనికి ఆ చాన్స్ లేకుండా పోయింది. వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాల్సి వచ్చింది. దారుణ ఓటమి ఎదురుకావడంతో కొద్దిరోజులపాటు బాలినేని సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు బాలినేనిని జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో పార్టీలో కొనసాగాలా? వద్దా? అన్న డైలమాలో ఉన్నారు బాలినేని.
* పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరు
వైసిపి కార్యక్రమాలకు కూడా బాలినేని హాజరు కావడం లేదు. జగన్ నిర్వహించిన సమీక్షలకు వెళ్లడం లేదు. ఓడిపోయిన తర్వాత జగన్ను కలవలేదు. ఇటీవల పార్టీ నుంచి చాలామంది వైసీపీ నేతలు బయటకు వెళ్లిపోయారు. టిడిపిలో కలిశారు. వారిని బాలినేని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇంతలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు జగన్. దీంతో ప్రకాశం జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తున్నారు ఆయన. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తానని తరచూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని జిల్లా బాధ్యతలను కోరారు. అందుకు జగన్ అంగీకరించలేదు. అందుకే పార్టీ నుంచి సైడ్ కావాలని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం.