
ఆరు వారాల లాక్ డౌన్ వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిందని, కేంద్ర సహకారం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీ కి సూచించారు. ప్రధాని ఢిల్లీ నుంచి సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ పలు అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే పేదలకు మేలు జరుగుతుంది. పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్ నిరంతర కొనసాగింపు ఆర్థికంగా కుంగదీస్తుందని, సడలింపు ఇవ్వాలన్నారు. అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో నియంత్రణ ఎత్తివేయాలని, రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరారు.
బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థలో భౌతిక దూరం పాటించడంతో పాటు, శానిటైజేషన్ చర్యలతో కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.
లాక్‌డౌన్‌లో కేంద్రం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చిందని, దీని వల్ల కేసులను నియంత్రించగలిగామన్నారు.
రాష్ట్రంలో మూడు పర్యాయాలు సమగ్ర సర్వే నిర్వహించాం. దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో, వారందరికీ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 6 వారాల లాక్‌డౌన్ పరిస్థితులను సమీక్షించుకుంటూనే సాధారణ పరిస్థితులు నెలకొనే దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కోవిడ్‌పై భయాందోళనను తొలగించలేకపోతే అడుగు ముందుకు వేయలేమని చెప్పారు. ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం లేదని, ఇది మొత్తం కరోనా పరీక్షల ఉద్దేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోందన్నారు.
కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలను క్లస్టర్లు, కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించడం, అదే విధంగా సంస్థాగతంగా క్వారంటైన్ ప్రక్రియపై మరోసారి ఆలోచించాల్సి ఉందని చెప్పారు. దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 85 శాతం కేసుల్లో మైల్డ్ సింప్‌టమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయని, కాబట్టి కరోనాకు వ్యాక్సిన్ కనుక్కొనే వరకు ఆ వైరస్‌లో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలన్నారు. వర్క్ ప్లేస్‌లు, ఉత్పత్తి కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు), మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఒక స్పష్టమైన ప్రామాణికత (ఎస్‌ఓపీ)ను రూపొందించాల్సి ఉందని చెప్పారు.
అవసరమైన శాంపిల్ కలెక్షన్ సెంటర్లు, కోవిడ్–19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా, కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
వాటితో పాటు, టెలి మెడిసిన్, కాల్ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషించనున్నాయన్నారు. హైరిస్క్ ఉన్న వారికి మరింత అవగాహన కల్పించడంతో పాటు, హోం ఐసొలేషన్‌కు సంబంధించి ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు.
కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు పెంచాం. ఐసీయూ బెడ్లు కూడా చాలా ఏర్పాటు చేశామని, కానీ వాటిని ఇంకా ఇంకా పెంచాల్సి ఉందన్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో టీచింగ్ ఆస్పత్రుల స్థాయిలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. రోజులో 24 గంటల పాటు పని చేసే సిబ్బందితో గ్రామ క్లినిక్‌లు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తయారీ రంగం పుంజుకోవాలంటే ముడిసరుకులు అందడం, ప్రజల రాకపోకలు (మూమెంట్) అనేది చాలా అత్యవసరం ఉందని, సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. మా రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా మార్కెట్లు, రిటైల్ రంగం మూతబడి ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ లేదు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మిగులు కనిపించి తీవ్రంగా దెబ్బ పడుతోందని, మరోవైపు రాష్ట్రంలో వినియోగం తక్కువగా ఉందన్నారు.