ఆంధ్రప్రదేశ్ అప్పులపాలవుతోంది. వేల కోట్లు వడ్డీలుగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేస్తోంది. దీంతో ప్రజలపై పెనుభారమే పడనుంది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏఫీ ప్రభుత్వానికి బ్యాంకులు షాకిస్తున్నాయి. అప్పులు కావాలంటే ఆస్తులు తనఖా పెట్టాలని సూచిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టేందుకు సైతం సిద్ధమవుతోంది.
విశాఖలో ఇప్పటికే 213 ఎకరాలను బ్యాంకులకు తాకట్ట్టు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని ఆస్తుల్ని కుదువ పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టేందుకు వీలు కాకపోవడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖ ఆస్తులను తాకట్టు పెట్టేందుకు సర్కారు సంకల్పించింది. అయితే వాటిని ఎలా తాకట్టు పెట్టాలనే విషయం పై తర్జన భర్జన పడుతోంది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకుంటోంది.
ఆస్తులతోపాటు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు ఆలోచనలు చేస్తోంది. రుణమిచ్చినప్పుడు తిరిగి చెల్లించేందుకు ఎస్ర్కో కావాలని అడుగుతున్నాయి. ఎస్ర్కో అంటే తమకు ఏ సోర్స్ తో చెల్లిస్తారో ఆసోర్స్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని నేరుగా ఓ ఖాతాకు మళ్లించడం. ఇప్పటికే మద్యం విషయంలో మందు బాబుల జేబు గుళ్ల చేస్తున్న ప్రభుత్వం దాన్ని బ్యాంకుల కిస్తీలు చెల్లించడానికే వెచ్చిస్తోంది. దీంతో వస్తున్న ఆదాయాన్ని ఇలా తాకట్టు పెట్టేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది.
ఆదాయం కన్నా ఖర్చు నాలుగైదు రెట్లు ఎక్కువ ఉండడంతో ప్రభుత్వానికి ఎటు పాలుపోవడం లేదు. ఎన్ని అప్పులు చేసినా ఆస్తులు అమ్మక తప్పని పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లు, ఎమ్మార్వో కార్యాలయాలను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాకట్టు పెట్టడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు.
దీంతో కార్పొరేషన్ల పేరుతో ఆస్తుల్ని బదలాయించడం చట్ట విరుద్ధమన్న వాదనలు వినిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. రెండేళ్ల కాలంలో సంక్షేమ పథకాల కోసం దాదాపుగా లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏటా రూ.30వేల కోట్లు వడ్డీలు కడుతోంది. దీంతో ప్రజల నెత్తిన భారం ఎక్కువయ్యేలా ఉంది.