కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న ఢిల్లీ పరాజయం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనా ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నది. పార్టీ అధినాయకత్వం తీరు మారాలంటూ బహిరంగంగానే విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేశ్‌లు ఆ జాబితాలో చేరారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందని సింధియా అంటూ, పార్టీలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మరో నేత జై రాం రమేశ్ […]

Written By: Neelambaram, Updated On : February 14, 2020 12:05 pm
Follow us on

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనా ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నది. పార్టీ అధినాయకత్వం తీరు మారాలంటూ బహిరంగంగానే విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేశ్‌లు ఆ జాబితాలో చేరారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందని సింధియా అంటూ, పార్టీలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మరో నేత జై రాం రమేశ్ అయితే మరో అడుగు ముందుకు వేసి పార్టీ అధికారం కోల్పోయి ఆరేళ్లయినా తమలో కొంతమంది తాము ఇంకా మంత్రులమేనన్న రీతిలో ప్రవర్తిస్తున్నారంటూ పార్టీ నేతలకు చురకలు వేశారు.

‘కాంగ్రెస్ నేతలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఉనికిని కోల్పోతాం. మన తలబిరుసుతనం పోవాలి. అధికారానికి దూరమై ఆరేళ్లయినా మనలో కొంతమంది తాము ఇంకా మంత్రులమేనన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు’ అని రమేశ్ ఘాటుగా స్పందించారు. పార్టీ నాయకత్వం, పని తీరు మారాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే జ్యోతిరాదిత్య సింధియా 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్న అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీనిఅభినందిస్తూ, ఢిల్లీ ప్రజలు మరో సారి మీబృందంపై విశ్వాసముంచారని చెప్పారు.

కాగా, ఫలితాలు తనకు తీవ్ర నిరాశ కలిగించాయని అంటూ కాంగ్రెస్‌కు కొత్త తీరు అవసరముంది. కాలం మారింది.. దేశం కూడా మారింది. మనం ప్రజలకు చేరువ కావాలి. లోక్‌సభ ఎన్నికల తర్వాత మనం కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం’ అని గాంధీ కుటుంబానికి సన్నిహాయ్తుడైన సింధియా పేర్కొన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పతనం దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హయాంలోనే మొదలైందంటూ పార్టీ ఢిల్లీ ఇన్‌చార్జి పిసి చాకో చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవర తప్పు బట్టారు. షీలా దీక్షిత్ గొప్ప నాయకురాలు, సమర్థవంతమైన పరిపాలకురాలని, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను నిందించడం దురదృష్టకరమని దేవర అన్నారు.

పార్టీ ఘోర పరాజయానికి నేనుసైతం బాధ్యత వహించాలి అంటూ ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిష్ట ముఖర్జీ ట్వీట్ చేశారు. ఎన్నికలన్న తరువాత గెలుపు ఓటమిలు సహజమేననీ.. అయితే, బీజేపీకి చావుదెబ్బ తగలడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

బీజేపీని వ్యతిరేకించే అనేకమంది ఆప్‌కు లేదా కాంగ్రెస్‌కు ఓటు వేశారంటూ ఆ పార్టీ ఎంపీ ప్రతాప్‌సింగ్ బజ్వా పేర్కొన్నారు. ‘రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో ఒకటి మాత్రం చెప్పగలం.. నాయకత్వ లోపం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు.. ప్రజలకు ఆ నాయకుడిపై నమ్మకం ఉంటే తప్పక గెలిపిస్తారు’ అని బజ్వా వివరించారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ. చిదంబరం మాట్లాడుతూ ఢిల్లీలో 15 ఏళ్లపాటు షీలా దీక్షిత్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించడంలో వైఫల్యం చెందామనీ పేర్కొన్నారు.