
వాస్తవానికి తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ చేరువ కావడానికి.. ఇంకో దశాబ్దం కన్నా ఎక్కువ సమయమే పట్టేది. కానీ.. కరోనా రాకతో చాలా వేగంగా దగ్గరైపోయింది. తొలి విడత సుదీర్ఘ లాక్ డౌన్ తో ప్రేక్షకులకు వినోదం కరువైన వేళ.. అనివార్యంగా ఓటీటీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు సెకండ్ లాక్ డౌన్ లోనూ మరోసారి ఓటీటీల ప్రాధాన్యం పెరిగింది. థియేటర్లకు వెళ్లడానికి భయపడాల్సిన పరిస్థితులు రావడంతో.. ఓటీటీలోనే సినిమాలు చూడడానికి మెల్లగా అలవాటు పడిపోతున్నారు.
దీంతో.. భవిష్యత్ లో ఇది కూడా మంచి వ్యాపార మార్గం అవుతుందని భావించిన వారు ఇందులోకి దిగుతున్నారు. ఇప్పటికే.. ఆహా, జీ-5 వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తెలుగు సంస్థలుగా అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో ఓటీటీ సంస్థ కూడా రాబోతోంది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. జనం మొత్తం ‘స్మార్ట్’ గా మారిపోతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ‘ఈటీవీ భారత్’ అనే న్యూస్ యాప్ ను ఆరంభించిన రామోజీ.. ఇప్పుడు ఓటీటీలోకి సైతం వచ్చేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం 200 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు భోగట్టా.. భారీ స్థాయిలో పెడుతున్న ఈ ఓటీటీ సినీ ఇండస్ట్రీ లో షేక్ చేయడం ఖాయమంటున్నారు.
‘ఉషాకిరణ్ మూవీస్’ నిర్మించిన సినిమాలతోపాటు ఈటీవీ కొనుగోలు చేసిన చిత్రాలను ఈ ఓటీటీలో ప్రసారం చేస్తూనే.. సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందించేందుకు సైతం ప్లాన్ చేస్తున్నారట. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఓ ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. త్వరలోనే ఈటీవీ ఓటీటీ లాంఛ్ కావడం ఖాయమని తెలుస్తోంది.