Gleeden Survey: మిగతా దేశాలతో పోల్చితే.. మనదేశంలో వివాహ వ్యవస్థను చాలా గౌరవంగా చూస్తారు. నేటి సోషల్ మీడియా కాలంలోనూ వివాహ వ్యవస్థకు ఏమాత్రం గౌరవం తగ్గలేదు. తగ్గదు కూడా. పొరుగు దేశాలతో పోల్చితే మనదేశంలో వివాహ వ్యవస్థను ఏడు జన్మల బంధంగా పరిగణిస్తారు. అత్యంత పవిత్రమైనదిగా గౌరవిస్తారు. పైగా వివాహ క్రతువును అత్యంత సంప్రదాయ బద్ధంగా జరుపుతారు. అందువల్లే ప్రపంచ దేశాలు మన వివాహ వ్యవస్థను గౌరవిస్తాయి. కొంతమంది విదేశీయులైతే మన విధానంలో వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, రాను రాను కాలం మారుతున్నట్టే.. మన వివాహ వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే వివాహ వ్యవస్థ పై పురుషులు, స్త్రీల వైఖరి మారుతోంది. ఇటీవల ఒక సంస్థ టైర్ – 1, టైర్ – 2 నగరాలలో 25 నుంచి 50 సంవత్సరాలు ఉన్న 1,503 మంది భారతీయులపై సర్వే నిర్వహించింది.
గత కొంతకాలం నుంచి మన దేశంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. అయితే వీటిని వివాహితులు తప్పుగా చూడటం లేదు. ఒకరిని పెళ్లి చేసుకున్న అనంతరం, మరొకరితో శారీరక సంబంధం కలిగి ఉండడం మన దేశ చట్టాల ప్రకారం నేరం. కానీ దీనిని చాలామంది తప్పుగా చూడటం లేదు. పైగా స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇటీవల కాలంలో వివాహేతర డేటింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. వివాహం చేసుకున్న పురుషులు, స్త్రీలు డేటింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని గ్లీడెన్ అనే సర్వే సంస్థ వారిని ప్రశ్నించగా..” జీవితంలో సుఖం ఉండాలి. భాగస్వాముల ద్వారా అది లభించడం లేదు. పైగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలే తరచూ చర్చకు వస్తున్నాయి. అలాంటప్పుడు దేహానికి సాంత్వన కావాలి. మంచి మాటలు చెప్పే మనిషి కావాలి. ప్రేమగా మాట్లాడే ఒక తోడు కావాలి. వీటన్నింటినీ వెతుక్కునే క్రమంలో తప్పు చేస్తున్నామనిపిస్తోంది. కానీ మనసు మాట వినడం లేదు. ఏం చేయమంటారని” చాలామంది వివాహితులు తమ సమాధానంగా చెప్పారు.
గ్లీడెన్ సర్వేలో పాల్గొన్న వారిలో అన్ని వయస్సుల వారున్నారు. అయితే ఇందులో మధ్య వయసు ఉన్నవాళ్లు వివాహేతర సంబంధం పై సానుకూలంగా మాట్లాడటం విశేషం. పైగా జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారనే అపరాధ భావం వారిలో కనిపించడం లేదట. పైగా జీవితాన్ని సుఖంగా, సంతోషంగా మార్చుకోవడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారట. మరొక వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉండడం నేరం కదా అని ప్రశ్నిస్తే.. ఇందులో 46 మంది పురుషులు తప్పని చెబితే.. మిగతా 54 శాతం మంది ఒప్పన్నారట. ఇక మహిళల విషయంలో 48 శాతం మంది ఆ సంబంధాన్ని బలపరచగా.. 52 శాతం మంది నేరమని పేర్కొన్నారట. ఇక కొంతమంది అయితే డిజిటల్ ప్రపంచంలో రిలేషన్ షిప్ లో చీటింగ్ అనేది సర్వసాధారణమని.. దానిని అంతగా సీరియస్ గా తీసుకోవద్దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. కొంతమంది పురుషులు పర్చువల్ ఫ్లర్టింగ్ ను ఇష్టపడుతున్నారట. ఇలాంటి వారిలో కొచ్చి నగరం ముందు వరుసలో ఉందట. ఇది మాత్రమే కాదు 33 శాతం మంది పురుషులు పెళ్లైనప్పటికీ వేరే తోడు కోసం వెతుకుతున్నారట. ఈ జాబితాలో 20 శాతం స్త్రీలు తమ భర్తల ప్రవర్తన తీరు పట్ల అంత ఆశాజనకంగా లేరట. కొంతమంది మాత్రం తమ భాగస్వామి రోజూ తమను విభిన్నంగా సంతృప్తి పరచాలని.. బిడియం లేకుండా చెప్పేశారట..సో, ఈ సర్వే ప్రకారం మనదేశంలో వివాహ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ.. పాశ్చాత్య పోకడలు దానికి బీటలు వారేలా చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.