Sir Creek: సర్ క్రీక్.. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ సమీపంలో ఉన్న ప్రాంతం. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ ప్రాంతం భారత్‌కు అత్యంత కీలకమైనది. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కొన్ని రోజులుగా కార్యకలాపాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భుజ్ మిలిటరీ స్థావరంలో అక్టోబర్ 2న శస్త్రపూజ సందర్భంగా పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో సర్ క్రీక్ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్దేశపూర్వక చొరబాటు ప్రయత్నం చేసినా గుణపాఠం రాజ్‌నాథ్‌సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
సర్ క్రీక్ ఎక్కడుంది?
సర్ క్రీక్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ సమీపంలో, అరేబియా సముద్ర తీరాన ఉన్న సుందర్‌బన్ తరహా తడి ప్రాంతం. ఇది సుమారు 96 కిలోమీటర్ల పొడవున సాగుతూ భారతదేశం–పాకిస్తాన్ సముద్ర సరిహద్దు మధ్య వెలసింది. ఇక్కడి భూభాగం సహజంగా మారుతూ, కాలానుగుణంగా నది మార్గాలు, డెల్టా నిర్మాణాలు మారిపోవడం వల్ల భూపటాల నిర్వచనంలో స్పష్టత లేకపోవడం ఈ వివాదానికి కేంద్రం. సర్ క్రీక్ యాజమాన్యంపై తలెత్తిన సమస్య 1914లో బ్రిటిష్ రాజ్ కాలం నాటి సరిహద్దు ఒప్పందానికి దారితీస్తుంది. ఆ ఒప్పందం ప్రకారం క్రీక్ మధ్య గీత (mid-channe) భారతదేశ సరిహద్దుగా గుర్తించబడింది. కానీ నదీ ప్రవాహం మారడంతో పాకిస్తాన్ వైపు కొన్ని భూభాగాలు వెళ్లివచ్చాయి. పాకిస్తాన్ మాత్రం క్రీక్ తూర్పు తీరాన్ని సరిహద్దుగా పేర్కొంటూ పెద్దభాగాన్ని తమదిగా ప్రకటించింది. భారతదేశం మాత్రం అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం మధ్య రేఖా సూత్రం (Thalweg Principle) ఆధారంగా సరిహద్దు నిర్ణయించాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తోంది.
వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యత
సర్ క్రీక్‌లో కేవలం భూభాగం సమస్యే కాదు.. సముద్ర ఆర్థిక హక్కులు కూడా ప్రధాన అంశం. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న సముద్రంలో సహజ వాయువు, చమురు వనరులు ఉన్నాయని జియోలాజికల్ అధ్యయనాలు వెల్లడించాయి. అంతేగాక, ఇది ఫిషింగ్ జోన్‌గానూ అత్యంత లాభదాయకం. ఆర్థిక దృష్ట్యా ఈ హక్కులు ఎవరికీ లభిస్తాయన్నది రెండు దేశాలకు కూడా అత్యంత వ్యూహాత్మకంగా భావించబడుతోంది.
భద్రతా పరంగానూ..
సర్ క్రీక్ ప్రాంతం దుర్భేద్యమైన మడ ప్రదేశం కావడంతో చొరబాటు ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా గతంలో పాకిస్తాన్ నుంచి మిలిటెంట్లు భారత భూభాగంలోకి చొరబడ్డారని భద్రతా సంస్థలు సూచించాయి. అందుకే భారత తీరరక్షక దళం (కోస్ట్ గార్డ్), నేవీ ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి.
గత రెండు దశాబ్దాల్లో పలు సార్లు భారత్–పాక్ సాంకేతిక స్థాయి చర్చలు జరిగాయి. 2007లో సర్ క్రీక్ సరిహద్దు దృష్ట్యా హైడ్రోగ్రాఫిక్ సర్వే కూడా చేపట్టారు, కానీ నిర్ణయాత్మక ఫలితం రాలేదు. కశ్మీర్, సియాచిన్ వంటి ప్రధాన విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ అంశం తరచూ పక్కకు పోయింది. ఇరు దేశాల సముద్ర వనరులు, భద్రతా పరిరక్షణ, వ్యూహాత్మక సమతుల్యానికి సంబంధించిన అంశం. సర్ క్రీక్ ప్రశాంతంగా ఉండాలంటే రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం ఉండాలి.