FIPIC Conference : కళ్ళున్న వాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్న వాడు దునియా మొత్తం చూస్తాడు. అలా చూస్తున్నాడు కాబట్టే మోదీ ప్రపంచ నాయకుడిగా వినతి కెక్కుతున్నాడు. పక్కలో బళ్ళెం లాగా తయారైన చైనా దేశాన్ని, “పసిఫిక్” సముద్రంతో కొడుతున్నాడు. వాస్తవానికి చైనా తన చుట్టూ ఉన్న దేశాలను మాత్రమే కాకుండా సముద్రమార్గం ఉన్న దేశాలను కూడా తన అవసరాలకు వాడుకుంటున్నది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మీద భారీగా పెట్టుబడులు పెట్టి ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలి అనుకుంటోంది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టి వాటిని ఏ విధంగా ఇబ్బందికి గురిచేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది.. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, చైనాలో తయారీ వ్యవస్థ బలంగా ఉండడం, దానిమీద ఆధారపడటంతో చాలా దేశాలు ఏమీ అనలేని పరిస్థితి. అయితే అమెరికా ప్రభావం కమిటీ ప్రపంచం నుంచి తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారత్ ఎదగాలి అనుకుంటున్నది. అయితే ఇందులో భాగంగా ముందుగా పసిఫిక్ రీజియన్ మీద పట్టు పెంచుకోవాలని భావిస్తోంది.
వరాల జల్లుకు అదే కారణం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజులుగా పసిఫిక్ ద్వీపదేశాలలో పర్యటిస్తున్నారు. ఆ దేశాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. మెరుగైన తాగునీరు, పారిశుధ్యం, ఆస్పత్రులు వంటివి నిర్మించేందుకు దండిగా నిధులు ఇస్తున్నారు. ఇవే కాకుండా భవిష్యత్తు అవసరాలు కూడా తాము తీర్చుతామని ఆ దేశ ప్రజలకు హామీ ఇస్తున్నారు. భారత్ అంటే పెత్తనానికి ప్రతీక కాదని, ప్రేమకు, ఆప్యాయతకు చిరునామా అని మోదీ తన ప్రతి ప్రసంగంలోనూ వివరిస్తున్నారు. పసిఫిక్ సముద్రం చుట్టూ విస్తరించిన 14 ద్వీపదేశాలను తాము కాపాడుకుంటామని మోదీ స్పష్టం చేస్తున్నారు. “ఫోరం ఫర్ ఇండియా.. పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ కో ఆపరేషన్ ( ఎఫ్ ఐ పీ ఐ సీ) సదస్సు ముఖ్య ఉద్దేశం ఆర్థిక అవసరాలు కాదని, మనిషికి ఒక మనిషి చేతనందించడం అని మోదీ చెబుతూ ఆ ప్రజల హృదయాలు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మనిషి కావలసిన కనీస సౌకర్యాలు కల్పించినప్పుడే ఆ దేశం మీద అక్కడి పౌరులకు నమ్మకం ఏర్పడుతుందని మోదీ చెబుతూనే.. పసిఫిక్ ద్వీప దేశాల ప్రజల అవసరాలు మేం తీరుస్తామని మోదీ హామీ ఇస్తున్నారు. ” కోవిడ్ సమయంలో మేము నమ్మినవారు మాతో నిలబడలేదు. కానీ, భారత్ మాత్రం పసిఫిక్ ద్వీప దేశాలకు అండగా నిలిచింది. ఎలాంటి సంకోచం లేకుండా మాతో అనేక అనుబంధాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందని” పపువా న్యూగినియా దేశం తెలిపింది. పసిఫిక్ ద్వీపదేశాల్లో పపువా న్యూగినియా, ఫిజీ, కుక్ ఐలాండ్, కిరిబటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్, మైక్రో నేసియా, నౌరూ, నియూ, పలావ్, సమోవా, సాల్మన్ ఐలాండ్స్, టోంగా, తువాలు, వనువటు ఉన్నాయి. అయితే ఈ దేశాలపై ప్రధాని వరాల జల్లు కురిపించారు. ఫిజీ లో కార్డియాలజీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పపువా న్యూ గినియా ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ ఐటీ ని “రీజినల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ హబ్” గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
భారత్ పై పొగడ్తలు
అయితే ఈ సదస్సులో పసిఫిక్ రీజియన్ దేశాలు భారత్ పై పొగడ్తల వర్షం కురిపించాయి. పఫువా న్యూ గినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ప్రపంచ వేదికపై భారత నాయకత్వాన్ని తాము కోరుకుంటున్నామని ప్రకటించారు. అగ్రదేశాలు ఆడిన ఆధిపత్య ఆటలో తాము పావులమయ్యామని, భారత్ మాత్రం ప్రపంచ నాయకత్వం పటిమను ప్రదర్శిస్తున్నదని ఆయన కొనియాడారు..ఇక అటు ఫిజీ, పపువా న్యూ గినియా లు ప్రధానమంత్రిని తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఫిజీ ప్రధాని సిటివేని రెబుకా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ” దీ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ” తో సత్కరించారు.. పపువా న్యూ గినియా ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ” కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగుహూ” పురస్కారాన్ని ప్రధానం చేసింది. ఇక ఆరవ శతాబ్ది కవి తిరువల్లూరు తమిళంలో రచించిన ద్విపద కవితలను పపువా న్యూ గినియా అధికార భాష పిసిన్ లో అనువదించిన గ్రంథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గినియా ప్రధాని జేమ్స్ మరపే ఆవిష్కరించడం విశేషం. అనంతరం అక్కడి నుంచి ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.
వంటలతో దౌత్యం
వరాల జల్లుతోనే కాకుండా వంటలతోనూ ప్రధానమంత్రి అక్కడి దేశ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎఫ్ ఐసిఐసి సదస్సు సందర్భంగా సభ్య దేశాల అధినేతలు, ప్రతినిధులకు ప్రధాని నేరుగా ఏర్పాటు చేశారు. ఈ విందులో చిరుధాన్యాలతో చేసిన వెజిటేబుల్ సూప్, ఖాండ్వి, మలై కోప్తా, రాజస్థానీ రాగి గట్ట కర్రీ, దాల్ పంచ్మేల్, మిల్లెట్ బిర్యాని, పుల్కా, మసాలా చాస్, పాన్ కుల్ఫీ, మల్పువాను అతిథులకు వడ్డించారు. తేనీటి విందులో మసాలా చాయ్, గ్రీన్ టీ, మింట్ టీ, పపువా న్యూ గినియా కాఫీ కూడా సర్వ్ చేశారు.. ఈ వంటకాలను తిని అతిథులు ఫిదా అయ్యారు.
Humbled by the gesture of Papua New Guinea of conferring me with the Companion of the Order of Logohu. Gratitude to Governor General Sir Bob Dadae for presenting the award. This is a great recognition of India and the accomplishments of our people. pic.twitter.com/VDhqTJK6Ra
— Narendra Modi (@narendramodi) May 22, 2023