Trump Tariffs On India: భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేలా తోడ్పడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించారు. ఆగస్టు 27 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ సుంకాలు టెక్స్‌టైల్స్, ఆభరణాలు, చర్మ ఉత్పత్తులు, సీఫుడ్ వంటి రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మోదీ విరుగుడు కనిపెట్టారు. 40 దేశాలకు టెక్స్‌టైల్ ఎగుమతులను విస్తరించే కౌంటర్ ప్లాన్‌ను రూపొందించింది.
టెక్స్‌టైల్ రంగంపై టారిఫ్ ఎఫెక్ట్..
అమెరికా, భారత్ యొక్క అతిపెద్ద ఎగుమతి మార్కెట్, 2024–25లో 86.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసింది. ఇందులో టెక్స్‌టైల్స్ 10.8 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉంది. 50% టారిఫ్‌లతో ఈ రంగం 63.9% వరకు సుంకాలను ఎదుర్కొంటోంది, దీంతో తిరుప్పూర్, నోయిడా, సూరత్ వంటి ఎగుమతి కేంద్రాల్లో ఉత్పత్తి స్థంభించింది. ఈ సుంకాలతో భారత ఉత్పత్తులు వియత్నాం (12%), బంగ్లాదేశ్ (13.2%) కంటే ధరల్లో 30–35% అననుకూలంగా మారాయి, ఫలితంగా ఆర్డర్లు రద్దవుతున్నాయి.
మోదీ కౌంటర్ ప్లాన్..
పరిస్థితిని చక్కదిద్దేందుకు మోదీ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేశారు. అమెరికా మార్కెట్‌లో నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా 40 దేశాలను లక్ష్యంగా చేసుకుని టెక్స్‌టైల్ ఎగుమతులను పెంచే వ్యూహాన్ని రూపొందించింది. ఈ దేశాలు ఏటా 590 బిలియన్ డాలర్ల టెక్స్‌టైల్ దిగుమతులు చేస్తాయి, అయితే భారత్ వాటా 5–6% మాత్రమే. ఈ ప్రతిపాదిత కార్యక్రమాలు సూరత్ (ఆభరణాలు), తిరుప్పూర్ (నీట్‌వేర్), పానిపట్ (హోమ్ టెక్స్‌టైల్స్), బదోహి (కార్పెట్లు) వంటి క్లస్టర్‌లను ఈ మార్కెట్లతో అనుసంధానం చేస్తాయి. ఈ 40 దేశాల్లో భారత టెక్స్‌టైల్స్‌ను నాణ్యత, సుస్థిరత, వినూత్నతలతో ప్రచారం చేయడానికి కేంద్రం బ్రాండ్ ఇండియా గుర్తింపు కింద ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లు, బయ్యర్–సెల్లర్ సమావేశాలు, సుస్థిరత ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫికేషన్‌లు పొందేలా ఎగుమతిదారులకు మార్గదర్శనం చేయడం ఈ వ్యూహంలో భాగం. అలాగే, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలను ఉపయోగించుకోవడం ద్వారా ఎగుమతి ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పత్తి దిగుమతి సుంకం మినహాయింపు..
టెక్స్‌టైల్ రంగానికి మరింత ఊరట కల్పించేందుకు కేంద్రం ముడిపత్తి దిగుమతులపై 11% సుంకాన్ని తొలగించి, ఈ మినహాయింపును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం ఎగుమతిదారులకు ముడిసరుకు ఖర్చులను తగ్గించి, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోటీపడేందుకు సహాయపడుతుంది. ఈ చర్య వల్ల తిరుప్పూర్, బెంగళూరు వంటి టెక్స్‌టైల్ హబ్‌లలో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు ఆశిస్తున్నారు.