India Russia Missile Deal: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడి ధ్వసం చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రతిదాడి మొదలు పెట్టింది. పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్.. పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. అణ్వాయుధ ఆపరేటింగ్ సిస్టం దెబ్బతీసింది. ఇక పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ దాడులను తిప్పి కొట్టడంతో ఎస్–400 (సుదర్శన చక్రం) సమర్థవంతంగా పనిచేసింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ భారత్ సైనిక బలగాల విశ్వాసాన్ని మరింత పెంచింది. అత్యాధునిక రాడార్లతో గగనతలంలోని లక్ష్యాలను వంద కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నిర్వీర్యం చేసే ఈ వ్యవస్థకు గగన రక్షణలో సాటి మరోటి లేదని నిపుణులు చెబుతున్నారు.
రష్యా అందించిన ఆయుధం..
2018లో రష్యా నుంచి 5 ఎస్–400 ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో వీటి సమర్ధత చూసిన తర్వాత భారత్ ఇప్పుడు రూ.10 వేల కోట్లతో మరిన్ని ఎస్–400 లు కొనుగోలుకు సిద్ధమైంది. ఈమేరకు భారత వైమానిక దళం చర్చలు జరుపుతోంది. మరిన్ని ఎస్–400లు వస్తే తూర్పు, పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో గగనతల రక్షణ మరింత బలపడనుంది.
బ్రహ్మోస్ డబుల్ శక్తి..
ఎస్–400 ల కొనుగోలుతోపాటు బ్రహ్మోస్ క్షిపణిలో సాంకేతిక మార్పులు, సంయుక్త ఉత్పత్తి క్రమంలో భారత్–రష్యా కలిసి పని చేస్తున్నాయి. తద్వారా రెండు దేశాల రక్షణ భాగస్వామ్యం కేవలం వ్యాపారం కాక, వ్యూహాత్మక సహకారంగా మారుతోంది. ప్రస్తుతం బ్రహ్మోస్ రేంజ్ 400 కిలోమీటర్లు ఉండగా దానిని 800 కిలోమీటర్లకు పెంచే పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి బ్రహ్మోస్ 2.0ను సిద్ధం చేసేందుకు భారత్ పనిచేస్తోంది.
దేశ సరిహద్దుల్లో పెరుగుతున్న డ్రోన్ దాడులు, ఆర్టిలరీ బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం గగనతల భద్రతపై మరింత దృష్టి పెట్టింది. స్వదేశీ వ్యవస్థలు, విదేశీ సాంకేతికతలను సమన్వయం చేయడం భారత రక్షణ తయారీ రంగం స్వావలంబన విధానానికి దోహదం చేస్తుంది. ఎస్–400 కొనుగోలు భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చడమే కాకుండా, భవిష్యత్ యుద్ధాల్లో గగనతల ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంలో ఇది కీలక అడుగుగా భావించవచ్చు.