
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా 70.33 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు రిజిస్టర్ చేసుకున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా రూపొందించిన యాప్ Co-WINలో తమ వివరాలను నమోదు చేశారు. వ్యాక్సినేషన్ తొలి దశలో భాగంగా వీళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం 2.3 లక్షల మంది వ్యాక్సినేటర్లను గుర్తించింది. అంతేకాకుండా 51 వేల ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది. శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉన్న సవాళ్లను గుర్తించడంతోపాటు Co-WIN యాప్ అమలు ఎలా ఉందో పరిశీలించనున్నారు.