Viral Pic: భారత్‌లోని మెట్రోపాలిటన్ సిటీలలో ట్రాఫిక్ జామ్ కామన్ అయిది. చిన్నపాటి వర్షం కురిసినా.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. పది కిలోమీటర్ల దూరం కూడా గంటకుపైగా సమయం పడుతోంది. ఇలా ట్రాఫిక్ జాంలో సమయం వృథా అయిపోతోందని భావించిన ఓ మహిళ ఈ సమస్యకు తనదైన పరిష్కారాన్ని కనుక్కొంది. ప్రతీ క్షణం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కారులో ప్రయాణిస్తూనే కూరలు తరగడం ప్రారంభించింది. సమస్యకు తన పరిష్కారం ఇదీ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐటీ రాజధాని బెంగళూరులో..
బెంగళూరు అంటే దేశ ఐటీ రాజధాని. కానీ అక్కడ ఉండేవాళ్లకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ సమస్యలే. నిత్యం ట్రాఫిక్ జాంలతో అవస్థలు పడేవాళ్లు ఎంతో మంది తమ కష్టాలను సోషల్ మీడియాలో ఏకరవు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, కామెంట్స్ నెటిజన్లను కొన్ని సందర్భాల్లో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తే మరికొన్ని సందర్భాల్లో ఆలోచింపచేశాయి. కానీ ట్రాఫిక్ సమస్యను తనదైన తీరులో ఎదుర్కుందో మహిళ. తాను చేసిన పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది.
టైం వేస్ట్ కాకుండా..
ట్రాఫిక్ సమస్యతో చాలా సమయం వృథా అయిపోతుండటంతో ప్రియ అనే మహిళ విసిగిపోయింది. చివరకు తనదైన శైలిలో పరిష్కారం కనిపెట్టింది. కారులో బయలుదేరిన ఆమె అందులో కూర్చునే కూరగాయలు తరిగింది, చిక్కుడు కాయలను వలిచింది. అందుబాటులో ఉన్న సమయంలోనూ పనులు సమర్థవంతంగా చక్కబెడుతున్నా అంటూ కామెంట్ చేసింది.
చాలా మందికి నచ్చిన ఐడియా..
మహిళ ఉపాయం అనేక మందికి నచ్చడంతో నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇలాంటోళ్లే బెంగళూరులో బతకగలరు అంటూ కొందరు కామెంట్ చేశారు. ‘‘ఇలా బయలుదేరేటప్పుడు కారులోనే హైడ్రోపోనిక్స్ విధానంలో ఓ మొక్కను పెంచడం ప్రారంభిస్తే గమ్యం చేసేసరికి అది పెరిగి పెద్దదవుతుంది’’ అని మరో వ్యక్తి సరదా కామెంట్ చేశారు.