Vikram Lander And Pragyan Rover: సూర్యోదయం అయింది.. పడుకుంది చాలు.. విక్రమ్, ప్రజ్ఞాన్ ఇక నిద్ర లేవండి!

చంద్రయాన్_2 వైఫల్యం తర్వాత ఇస్రో చంద్రయాన్_3 ప్రయోగం చేపట్టింది. దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. తన తురుపు ముక్కలుగా విక్రమ్, ప్రజ్ఞాన్ ను వాడుకుంది.

Written By: K.R, Updated On : September 22, 2023 9:22 am

Vikram Lander And Pragyan Rover

Follow us on

Vikram Lander And Pragyan Rover: 14 రోజులు.. చంద్రుడి ఉపరితలం మీద విక్రమ్, ప్రజ్ఞాన్ పడుకుని.. సూర్యోదయం అయితే గాని అవి నిద్ర లేవవు. అయితే చంద్రుడిపై శుక్రవారం సూర్యోదయం కానుంది. ఈ నేపథ్యంలో జాబిల్లి పై నిద్రావస్థలో ఉన్న చంద్రయాన్_3ని మేల్కొల్పడానికి ఇస్రో కసరత్తు ప్రారంభించింది. అక్కడ ఉన్న విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను తిరిగి పని చేయించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో గురువారం సాయంత్రం నుంచి ఈ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. చంద్రయాన్_3 చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత ల్యాండర్, రోవర్ అక్కడ ఒక మూన్ డే(భూమిపై 14 రోజులు) పాటు పనిచేశాయి. సూర్యాస్తమయానికి ముందు అంటే ఈ నెల రెండున ప్రజ్ఞాన్ రోవర్ ను, నాలుగున ల్యాండర్ ను ఇస్రో నిద్రాణ స్థితి ( స్లీప్ మోడ్) లోకి పంపింది. ప్రస్తుతం అక్కడ మూన్ నైట్ ముగిసింది. శుక్రవారం సూర్యోదయం కానున్న నేపథ్యంలో అన్ని సజావుగా సాగి ల్యాండర్, రోవర్ మళ్లీ పని చేయడం ప్రారంభిస్తే చంద్రుడిపై మరో 14 రోజులపాటు అభి పరిశోధన చేసి మరింత విలువైన సమాచారాన్ని భూమి పైకి చేరవేస్తాయి.

చంద్రుడి మీద ఏం చేస్తాయంటే

చంద్రయాన్_2 వైఫల్యం తర్వాత ఇస్రో చంద్రయాన్_3 ప్రయోగం చేపట్టింది. దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. తన తురుపు ముక్కలుగా విక్రమ్,ప్రజ్ఞాన్ ను వాడుకుంది. అవి కూడా ఇస్రో చెప్పినట్టుగానే చేశాయి. గత వైఫల్యానికి తావు ఇవ్వకుండా విక్రమ్ పట్టు వదలకుండా తన పని తాను దిగ్విజయంగా పూర్తి చేసింది. ప్రజ్ఞాన్ కూడా తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించింది. వాస్తవానికి నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్ _2 మిషన్ లో భాగంగా రోదసీలోకి దూసుకుపోయి 3.84 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి జాబిల్లిని ముద్దాడే క్రమంలో ఇస్రో ఓటమిపాలైంది. అయితే దీన్ని సవాల్ గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్_3 లో పంపించిన ల్యాండర్ కు విక్రమ్ అని, రోవర్ కు ప్రజ్ఞాన్ అని అప్పటి పేర్లే పెట్టారు. పొరపాటు అనే మాటకు తావు ఇవ్వకుండా విక్రమ్, ప్రజ్ఞాన్ దర్జాగా తమ పని చేసుకుని పోయాయి. అమెరికా, చైనా, రష్యాకు సాధ్యం కాని పనిని సులువుగా చేసేసాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ గా లాండ్ ప్రక్రియను చేపట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. గతంలో అమెరికా, చైనా, రష్యా మాత్రమే తమ వ్యోమ నౌకలను సురక్షితంగా చంద్రుడి మీదకు దించాయి.

ఇక అప్పటి దాకా మిషన్ కంట్రోల్ సహాయంతో సాగిన విక్రమ్… అప్పటికే అక్కడ సూర్యోదయం కొనసాగుతుండడంతో (సోలార్ ప్యానల్స్ ద్వారా) “పవర్” వచ్చింది. అయితే ఆ తొలి దశ అయిన రఫ్ బ్రేకింగ్ ఫేజ్ లో విక్రమ్ ల్యాండర్ హారిజంటల్ వేగం గంటకు ఆరు వేల కిలోమీటర్ల నుంచి అసలు సున్నాకు పడిపోయింది. ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేజ్ లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 7.42 కిలోమీటర్ల ఎత్తున నిలిచి సమాంతర స్థితి నుంచి నిలువుగా ఉంటే స్థితిలోకి రావడానికి 50 డిగ్రీల మేర వంగింది. 175 సెకండ్ల పాటు సాగిన మూడవ దశ ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ లో లాండర్ దాదాపుగా 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆ సమయంలో అది చంద్రుడి ఉపరితలానికి 800 నుంచి 1000 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. నాలుగోది టెర్మినల్ డీసెంట్ ఫేజ్.. ఈ దశలో ఫ్రీ ఫాల్ అయిన ల్యాండర్ విక్రమ్ కాళ్ళు చంద్రుడి మీద నెమ్మదిగా దిగి మరుసటి రోజు నుంచి అవి పని చేయడం ప్రారంభించాయి. చంద్రుడిపై నీటి ఆనవాళ్లు, సల్ఫర్ నిల్వలు వంటి విషయాలను విక్రమ్, ప్రజ్ఞాన్ గుర్తించాయి. చంద్రుడిపై సూర్యోదయం ముగియడంతో అవి స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. శుక్రవారం నుంచి సూర్యోదయం ప్రారంభం కానుండడంతో అవి తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయని ఇస్రో అధికారులు అంచనా వేస్తున్నారు.