Monsoon 2023: విస్తరించాల్సిన మేఘాల స్థానంలో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. చినుకులు కురవాలిసిన వేళ వడగాలులు ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తున్నాయి. పంట చేలల్లో అరకలు సందడి చేయాల్సిన చోట నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. ఊరూ వాడా చిత్తడి కావలసిన సమయాన చినుకు జాడ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ లో ప్రకటించినప్పటికీ, వాటి కదలికలో చురుకుదనం లేకపోవడంతో వర్షాలు కురవడం లేదు. దీనికి తోడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వానాకాలం రెండో ఎండాకాలాన్ని తలపిస్తోంది.
స్కై మెట్ ఏం చెబుతోంది అంటే?
నైరుతి రుతుపవనాలు దేశంలోని కేరళ రాష్ట్రాన్ని ఆలస్యంగా తాకాయి.. ఈ రుతుపవనాలు త్వరగా విస్తరించాలంటే వాటికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. కానీ ఈ ఏడాది అనుకూలమైన వాతావరణం లేక అవి అంతగా విస్తరించలేకపోతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జోయ్ తుఫాన్ నైరుతి రుతుపవనాలకు అడ్డంకిగా మారింది. దీంతో దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం నాలుగు వారాల వరకు అంతగా ఉండదని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కై మెట్ అంచనా వేసింది.. అంతేకాదు ఈ ఏడాది వర్షాలు తప్పుగా ఉంటాయని, అది భారత్ లోని వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని అంచనా వేసింది. ఇక పసిఫిక్ సముద్రంలో ఎల్ నీనో ఏర్పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది అంతగా వర్షాలు కురవవని గతంలోనే ప్రభుత్వ వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు ఇప్పుడు అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడటంతో వర్షాలు కురిసే పరిస్థితి లేకుండా పోయింది. స్కై మెట్ అంచనా ప్రకారం జూలై ఆరు తర్వాతే దేశంలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఒకవేళ వర్షాలు కురిసినప్పటికీ మధ్య, పశ్చిమ భారతదేశంలో వర్షాభావ పరిస్థితులు ఎదురు కావచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది.
ఆలస్యంగా వచ్చాయి
సాధారణంగా జూన్ 1న రావలసిన నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళ తీరాన్ని తాకాయి. అయితే ఈ సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన తుఫాను నైరుతి రుతుపవనాల కదలికను అడ్డుకుంది.. ఇది సడన్ గా స్పీడ్ బ్రేక్ వేయడంతో రుతుపవనాలు అంత చురుకుగా కదలడం లేదు. రుతుపవనాలు చురుకుగా కదిలితేనే వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు కేరళలో ప్రవేశించినప్పటికీ మందకొడితనం వల్ల అక్కడ కూడా అంతంత మాత్రం గానే వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఇదే స్థాయిలో కదిలితే మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, చత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో జూన్ 15 వరకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించడం కష్టమని స్కై మెట్ అభిప్రాయపడుతోంది.
అరేబియా గుదిబండ
సాధారణంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించాలంటే దానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఈ రుతుపవనాలు విస్తరించే క్రమంలో అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడితే ఇక అంతే సంగతులు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కూడా అదే.. అయితే రుతుపవనాలు వేగంగా విస్తరించాలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం వంటిది ఏర్పడాలి. ఇక రుతుపవనాల విస్తరణలో వేగం లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:00 దాకా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. దీనికి వడగాలులు కూడా తోడు కావడంతో జనం బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. ఏదైనా అత్యవసర పని మీద బయటకు వస్తే అస్వస్థతకు గురికావాల్సి వస్తోంది. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో జనం బయటికి రావద్దని ప్రభుత్వం సూచిస్తుంది. ఇక పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పనివేళల్లో కూడా మార్కులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం పాఠశాలల పని వేళలను కుదించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.