BJP in South India: దక్షిణాదిలో బీజేపీ ఎందుకు ఈ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది?

బీజేపీ ఆశలపై కన్నడ ఓటర్లు నీళ్లు చల్లారు. తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకేల మధ్య పోటా పోటీ రాజకీయంతో అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వలేకపోయింది. కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య అధికార మార్పిడి మధ్యన కమల వికాసం జరిగేందుకు వీలు లేకపోయింది.

Written By: Dharma, Updated On : May 14, 2023 1:24 pm
Follow us on

BJP in South India: నాలుగు దశాబ్దాల కిందట గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బీజేపీకి ఈ పరిస్థితి ఏంటి? దక్షిణాదిన వెనుకబడిపోవడానికి కారణాలేంటి? ఇక కమల వికాసానికి చాన్సే లేదా? మిగతా రాష్ట్రాల్లో చొచ్చుకుపోవడం అంత ఈజీ కాదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వాస్తవానికి జన్ సంఘ్ నుంచి బీజేపీగా మారిన తరువాత సత్తా చాటింది ఏపీలోనే. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ సీటును బీజేపీ గెలుచుకుంది. అప్పటి పార్టీ అధ్యక్షుడు అటల్ బిహారి వాజ్ పేయ్ నేతృత్వంలో పార్టీ విజయం సాధించింది. బీజేపీకి అది తొలి విజయం. ఆ లెక్కన బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను కబళించాలి. కానీ అలా జరగలేదు. కర్నాటకలో ఎంట్రీ ఇచ్చినా.. సుస్థిరతకు తావులేకుండా పోయింది.

రెండు దశాబ్దాలుగా..
కర్నాటకలో 2000 వరకూ బీజేపీకి పట్టు దొరకలేదు. అక్కడ కాంగ్రెస్ కు దీటుగా జనతాదళ్ ఉండేది. కానీ కులపరంగా బీజేపీ అక్కడ రాజకీయం చేసింది. పట్టు సాధించింది. 2018 నాటికి 104 సీట్లకు ఎదిగింది. తొలిసారిగా బీజేపీ హిస్టరీలో దాదాపుగా నాలుగేళ్ల పాటు కర్నాటకను పాలించింది. ఈసారి ఫుల్ మెజారిటీతో అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆశలపై కన్నడ ఓటర్లు నీళ్లు చల్లారు. తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకేల మధ్య పోటా పోటీ రాజకీయంతో అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వలేకపోయింది. కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య అధికార మార్పిడి మధ్యన కమల వికాసం జరిగేందుకు వీలు లేకపోయింది.

కాంగ్రెస్ కు ఊపు..
అదే సమయంలో పూర్వ వైభవానికి కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు దిక్సూచిగా నిలిచాయి. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రులతో కలసి అధికారం పెంచుకోవడానికి ఆస్కారం దొరికింది. అన్నీ కుదిరితే ఏపీలో కూడా ఎంతో కొంత ఎదగడానికి కాంగ్రెస్ కే చాన్స్ ఉంది. తెలంగాణలో సైతం ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. ఎలా చూసుకున్న సౌత్ లో సత్తా చాటాలనుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని మళ్లీ దూరం పెట్టేశాయని అర్ధం అవుతోంది. అయితే ఈ ఫలితాలను హైకమాండ్ పెద్దలు ఎలా తీసుకుంటారో చూడాలి మరీ.

తెలంగాణలో కష్టమే..
అయితే తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ గెలుపొందేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలం తక్కువ అన్న టాక్ ఉంది. కానీ గెలుస్తామన్న ధీమా వ్యక్తమవుతోంది. ఇతర పార్టీ నేతలను ఆకర్షించే పనిలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనట్టు సంకేతాలు రావడంతో నేతలు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అక్కడ కూడా బీజేపీ ఉనికిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.