https://oktelugu.com/

NTR And Manmohan Singh: ఎన్టీఆర్, మన్మోహన్.. భారతరత్నాలు ఎందుకు కారు?

మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌.. ఆర్థికవేత్త, దేశానికి రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. ఆయన ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించారు.

Written By: , Updated On : February 9, 2024 / 04:33 PM IST
NTR And Manmohan Singh
Follow us on

NTR And Manmohan Singh: కేంద్రం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే.అధ్వాని, మాజీ ప్రధానులు పీవీ.నర్సింహారావు, చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌.స్వామినాథన్‌కు ఈఏడాది భారత రత్న ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అయితే.. ఇదే సమయంలో ఎప్పటి నుంచో భారత రత్న ఇవ్వాలని డిమాండ్‌ ఉన్నవారికి మాత్రం పురస్కారం దక్కడం లేదు. తాజాగా ముగ్గురికి అవార్డు ప్రకటించిన నేపథ్యంలో మరోమారు చర్చ జరుగుతోంది.

మన్‌మోహన్‌సింగ్‌..
మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌.. ఆర్థికవేత్త, దేశానికి రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. ఆయన ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, పీవీ నర్సింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కానీ, కేంద్రం ఆయనకు భారత రత్న ప్రకటించలేదు. ఉప ప్రధాని ఎల్‌కే.అద్వాని కన్నా విద్యావంతుడు, ప్రధానిగా చేసిన అనుభవం ఉన్నందున ఆయనకు కూడా భారత రత్న ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు.

నందమూరి తారకరామారావు..
ఇక తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆరు నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నేత నందమూరి తారకరామారావు. రాజకీయాలకన్నా ముందు ఎన్టీఆర్‌ సినిమాల్లోనూ నటించారు. కళాకారుడిగా తెలుగువారితోపాటు దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వందలాది సినిమాలు తీశారు. రాముడిగా, భీముడిగా, అర్జునుడిగా, కర్ణుడిగా పౌరాణిక సినిమాల్లో మెప్పించారు. రాముడు అంటే ఎన్టీరామారావే అన్నట్లుగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారు. కానీ, గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

అన్ని అర్హతలు ఉన్న మన్‌మోహన్‌సింగ్‌తోపాటు తెలుగువాడైన నందమూరి తారకరామారావుకు కూడా భారత రత్న ప్రకటించాలని పలువురు కోరుతున్నారు.