BJP Bihar election victory reasons: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి ఘన విజయం సాధించడంతో రాజకీయ వర్గాలంతా ఆశ్చర్యపోయాయి. ప్రతిపక్షం గట్టి పోటీని ఊహించినా, ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఈ విజయానికి ముఖ్య కారణంగా మహిళా ఓటు బ్యాంక్ పాత్రను నిపుణులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
సీఎం నితీశ్ కుమార్ ఆగస్టులో ప్రారంభించిన ‘మహిళా రోజ్‌గార్ యోజన’ ఈ ఎన్నికలో గేమ్ చేంజర్‌గా నిలిచింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.40 కోట్ల మహిళలకు రూ.10 వేలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. చిన్న స్థాయి వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం పథకం లక్ష్యం అయినా, ఎన్నికల నేపథ్యంలో ఇది నేరుగా రాజకీయ లాభంగా మారిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రపంచ బ్యాంకు నిధులతో రూ.14 వేల కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ మొత్తమే ఎన్నికలకు ముందు విడుదల కావడంతో ప్రతిపక్షం దీన్ని ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నమని ఆరోపించింది. అయినప్పటికీ, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనడం ఎన్డీఏకు లాభమైంది. గణాంకాల ప్రకారం మహిళా ఓటింగ్ శాతం 73 కాగా, పురుషుల ఓటింగ్ కేవలం 63 వద్ద నిలిచింది.
ప్రజా పథకాల శక్తి..
రాజకీయంగా ప్రజా పథకాలు సమాజంలో విశేష స్పందన తెచ్చినప్పటికీ, వాటి ఫలితం ఎల్లప్పుడూ ఎన్నికల్లో ప్రతిబింబించదు. ఉదాహరణకు, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ‘పసుపు–కుంకుమ’ పథకంతో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రతి మహిళ ఖాతాలో రూ.10 వేల చొప్పున జమ చేసినా టీడీపీ ఓటమి పాలైంది. ఇది చూస్తే, ఓటర్లకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ఒక్క నిర్ణయక ఫ్యాక్టర్ కాదని తెలియజేస్తుంది. అయితే పథకాలు సమయానుకూలంగా, నిమ్మితం ఆకర్షణీయంగా అమలైతే వాటి ఫలితం పెద్ద ఎత్తున ఓటు రూపంలో మారుతుందని బిహార్ ఉదాహరణ చెబుతోంది.
ఎన్నికల సంఘం అనుమతి వివాదాస్పదం..
బిహార్ పథకాలపై ఎన్నికల సమయంలో ఏ ఆటంకం లేకపోవడం, ఎన్నికల కమిషన్ తీసుకున్న సడలింపు నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. తెలంగాణ 2023లో రైతుబంధు విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. ఇక 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా బిహార్ ప్రభుత్వానికి, 2019లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వడం వివాదాస్పద అంశంగా మారింది.
మహిళా ఓటర్ల ఆకర్షణతోపాటు, ఎన్డీఏ కూటమి సామాజిక సమీకరణాలు కూడా బిహార్ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాయి. గ్రామీణ మహిళాల్లో సురక్షిత కుటుంబ వాతావరణం, ఆర్థిక ఆధారత పథకాల పట్ల నితీశ్ సానుభూతి మద్దతు చేకూర్చింది. ఈ ఓటు బలం బీజేపీ–జేడీయూ కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని తెచ్చింది.