https://oktelugu.com/

Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాదిపై నేతల ప్లాన్ ఏంటి?

దక్షిణాది రాష్ట్రాల నాయకులకు టానిక్ లా పనిచేశాయి. ఇన్నాళ్లూ బీజేపీ తమతో ఆడుకుంటే...ఇప్పుడు వీరు తిరిగి ఆడుకోవడం ప్రారంభించనున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 14, 2023 / 01:09 PM IST
    Follow us on

    Karnataka Election Results: దేశంలో తమకు ఎదురే లేదన్న ఆలోచనతో ఉన్న బీజేపీకి కాంగ్రెస్‌ మళ్లీ ఝలక్‌ ఇచ్చింది. సరిగ్గా ఆరు నెలల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లో ఇప్పుడు కర్ణాటకలో.. బీజేపీని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తద్వారా ఈ ఏడాదే జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెట్టించిన ఉత్సాహంతో ఎదుర్కొనేందుకు నైతిక స్థయిర్యాన్ని పొందింది. అయితే కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రారంభించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటకలో గెలుపుతో ఊపు మీద ఉన్న ఆ పార్టీ తెలంగాణలో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. తెలంగాణలో కానీ వర్కవుట్ అయితే మాత్రం ఇక కాంగ్రెస్ ను పట్టుకోలేం.కాంగ్రెస్ ఎంత బలహీనంగా కనిపిస్తుందో.. చిన్నపాటి బలంతో అంత పైకి లేవగలదు. గత అనుభవాల్లో ఇది తేటతెల్లమైంది. ఇప్పుడు కర్నాటక విజయంతో నిజం చేసేందుకు అవకాశం ఏర్పడింది.

    హేమాహేమీలు….
    దక్షిణాది రాష్ట్రాల్లో హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్, స్టాలిన్, పినరయ్ విజయ్ వంటి నాయకులు బలమైన పొజిషన్ లో ఉన్నారు. వీరికి జనాదరణ కూడా ఉంది. అయితే వీరికి బీజేపీ అంటే గిట్టదు. కానీ ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర పెద్దలతో స్నేహం చేయక తప్పని పరిస్థితి. దీంతో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో ఆడుకుంటూ వస్తోంది. అయితే కర్నాటక ఫలితాలు బీజేపీ ఆధిపత్యంపై చాచి కొట్టినంత పనిచేశాయి. దక్షిణాది రాష్ట్రాల నాయకులకు టానిక్ లా పనిచేశాయి. ఇన్నాళ్లూ బీజేపీ తమతో ఆడుకుంటే…ఇప్పుడు వీరు తిరిగి ఆడుకోవడం ప్రారంభించనున్నారు.

    వర్కవుట్ కాలే…
    దేశాన్ని పాలిస్తున్నాం కదా.. అన్ని రాష్ట్రాలు తమ చేతికి చిక్కాలన్నదే బీజేపీ ప్లాన్. మోదీ, షా ద్వయం ఈ విషయంలో కొంత సక్సెస్ అయ్యాయి కూడా. కానీ దక్షిణాది రాష్ట్రల విషయానికి వచ్చేసరికి వారి పాచిక పారలేదు. ఉన్న ఒక్క కర్నాటకను సైతం చేజార్చుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో బలపడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ నిత్య ప్రకటనలు చేస్తున్నారు. అయితే అది అంతా ఈజీ కాదని కర్నాటక ఫలితాలు హెచ్చరికలు పంపాయి. దీంతో ప్రాంతీయ పార్టీలతో జతకలిపి పార్టీని బలోపేతం చేయాలని డిసైడయినట్టు సమాచారం.

    ఆ రాష్ట్రాలపై ఫోకస్..
    ఈ ఏడాది చివర్లో తెలంగాణ, వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సర్వశక్తులూ ఒడ్డనున్నారు. అక్కడ బహుముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార బీఆర్ఎస్ కు లాభించే చాన్స్ ఉంది. అందుకే అక్కడ టీడీపీ, వైఎర్ టీపీతో వంటి పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. అయితే గెలుపు ఊపుతో ఉన్న కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలను అడ్డుకట్ట వేసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేసేందుకు పక్కా ప్లాన్ రూపొందించింది.

    కాంగ్రెస్ రియాక్షన్
    వాస్తవానికి 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మధ్యలో కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించినా.. పార్టీలో గ్రూపుల కారణంగా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని రెండోసారి దక్కించుకునే అవకాశం వచ్చినా.. చేజార్చుకుంది. ఈ పరంపర పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగింది. 2018 చివర్లో ఒకేసారి ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపొందింది. అయితే పార్టీలో గ్రూపులను నియంత్రించలేకపోయింది. బీజేపీ దీనిని ఆసరాగా చేసుకొని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పై ఎన్నిరకాల ప్రయోగాలు చేయాలో బీజేపీ అన్నీ చేసింది. అయితే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ అసలు విషయాన్ని గుర్తించింది. ఐక్యంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాష్ట్ర నాయకత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తోంది.