https://oktelugu.com/

Chandrayaan 3: విక్రమ్‌, ప్రజ్ఞాన్‌.. చంద్రుడిపై ఏం చేస్తున్నాయంటే!

చంద్రుడిపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి ఖనిజాల ప్రాథమిక కూర్పును పసిగడుతుంది. మట్టి, రాళ్లలోని రసాయనాలను గుర్తిస్తుంది.

Written By:
  • Rocky
  • , Updated On : August 24, 2023 7:19 pm
    Chandrayaan 3

    Chandrayaan 3

    Follow us on

    Chandrayaan 3: యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు.

    విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట..

    చంద్రయాన్‌-3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్‌ ‘విక్రమ్‌’. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా కీర్తించే డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరును దీనికి పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై సురక్షిత ల్యాండింగ్‌తో.. రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’ను విడుదల చేయడం దీని ప్రాథమిక బాధ్యత. సురక్షిత ల్యాండింగ్‌, అన్వేషణ కార్యకలాపాలకు అనేక సెన్సార్లు, దిగేందుకు వీలుగా సోలార్‌ ప్యానెళ్లు ఉండే విక్రమ్‌ రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది. బరువు 1,749 కిలోలు (ప్రజ్ఞాన్‌తో కలిపి). ఇస్రో వెల్లడించిన ప్రకారం.. ప్రత్యేక కెమెరా, ప్రాసెసింగ్‌ అల్గారిథమ్‌, లేజర్‌-ఆర్‌ఎఫ్‌ ఆధారిత ఆల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసిమీటర్‌, క్షితిజ సమాంతర వెలాసిటీ కెమెరా, ప్రమాదాల గుర్తింపు- నివారణ సహా అధునాతన సాంకేతికతలు విక్రమ్‌ సొంతం. ఇందులో మూడు పెలోడ్‌లు ఉన్నాయి.

    రాంభా

    రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌ సెన్సిటివ్‌ ఐనోస్పియర్‌ అండ్‌ అట్మాస్పియర్‌ దీని పూర్తి అర్థం. చంద్రుడిపై ప్లాస్మా సాంద్రత (అయాన్లు, ఎలకా్ట్రన్లు)ను, కాలక్రమంలో అది ఎలా మారుతుందో అధ్యయనం చేస్తుంది.

    ఛాస్టే

    చంద్రాస్‌ సర్ఫేస్‌ ఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌. థర్మోఫిజికల్‌ ప్రయోగం ద్వారా చంద్రుడిపై ధ్రువాలకు దగ్గరగా ఉన్న ఉపరితలం ఉష్ణోగ్రతలను కొలుస్తుంది..

    ఇల్సా

    ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ. ల్యాండర్‌ దిగిన ప్రాంతంలో భూకంపాల తీవ్రతపై పరిశోధనలు సాగిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై పొరలు, మట్టి స్వభావం ఎలాంటిదో అధ్యయనం చేస్తుంది. మున్ముందు ప్రయోగాలకు ఇది ఉపయోగం.

    జాబిల్లిపై బుడిబుడి అడుగులతో…

    ల్యాండర్‌ విక్రమ్‌ గర్భంలో మోసుకెళ్లిన రోబోటిక్‌ యంత్రం రోవర్‌ పేరు ప్రజ్ఞాన్‌. మొత్తం 6 చక్రాలతో 26 కిలోల బరువుండే ప్రజ్ఞాన్‌.. విక్రమ్‌ ల్యాండింగ్‌ తర్వాత దానిలోంచి బయటకు వస్తుంది. చంద్రుడి ఉపరితల వాతావరణ మౌలిక కూర్పుపై సమాచారాన్ని అందించేందుకు ఇందులో రెండు పెలోడ్‌లున్నాయి.

    ఏపీఎక్స్‌ఎస్‌.. ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌రే స్పెక్టోమీటర్‌ (ఏపీఎక్స్‌ఎస్‌):

    చంద్రుడిపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి ఖనిజాల ప్రాథమిక కూర్పును పసిగడుతుంది. మట్టి, రాళ్లలోని రసాయనాలను గుర్తిస్తుంది.

    ఎల్‌ఐబీఎస్‌.. లేజర్‌ ఇండ్యూస్ట్‌ బ్రేక్‌ డౌన్‌

    స్పెక్ట్రో స్కోప్: ఇదో విభిన్న పెలోడ్‌. దీనిలోని లేజర్‌ చంద్రుడి మట్టిపై పడుతుంది. దానిని కరిగించి రసాయన మూలకాలు, ఖనిజ సంపద గుర్తింపునకు కృషిచేస్తుంది. మెగ్నీషియం, అల్యూమినియం వంటి మూలకాల కూర్పు విశ్లేషణకు సహాయపడుతుంది.