https://oktelugu.com/

Crop Damage : రైతు గోస పట్టేదెవరికి.. ఎందుకీ శాపం.. ఎవరిదీ పాపం!

ఆగ్రహించిన వరణుడు అకాల వర్షం రూపంలో విరుచుకు పడ్డాడు. దీంతో మార్కెట్‌ యార్డులో ఉన్న ధాన్యం రాశులు, బస్తాలు తడిసిసోయాయి. కళ్లముందే ధాన్యం కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2023 / 10:54 AM IST

    Rains formers

    Follow us on

    Crop Damage : ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. దేశంలో సగానికిపైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. కానీ రైతు గోస ఎవరికీ పట్టుదు. విత్తనం వేసిన నాటి నుంచి మార్కెట్‌లో అమ్ముకునేవరకు అన్నదాతకు కష్టాలే. విత్తనం, ఎరువులు, మద్దతు ధర విషయంలో వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే.. సౌకర్యాలు కల్పించడంలో పాలకులు చిన్నచూపు.. చివరకు పగబట్టిన ప్రకృతి కూడా రైతన్నను కోలోకోలేని దెబ్బతిస్తోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్న కన్నడనాట.. రైతు గోస ఎవరికీ పట్టడం లేదు. రాయచూర్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రైతుల రెక్కట కష్టం నీటిపాలైంది.

    విరుచుకుపడిన వరుణుడు..
    రాయచూర్‌ రైతులు తాము పండించిన పంట చేతికి రావడంతో అన్నదాత మోములో ఆనందం వ్యక్తమైంది. సంతోషంగా పంటను కోసి.. నూర్పిడి చేసి.. అమ్మేందుకు రాయచూర్‌ మార్కెట్‌కు తీసుకొచ్చారు. మార్కెట్‌ మొత్తం ధాన్యపు రాశులే. తూకం వేసిన ధాన్యం బస్తాలే. కొన్ని రోజులైతే రైతు కష్టం సొమ్ము రూపంలో చేతికి అందేది. ఇంతలో ఆగ్రహించిన వరణుడు అకాల వర్షం రూపంలో విరుచుకు పడ్డాడు. దీంతో మార్కెట్‌ యార్డులో ఉన్న ధాన్యం రాశులు, బస్తాలు తడిసిసోయాయి. కళ్లముందే ధాన్యం కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి.

    అస్తవ్యస్త నిర్మాణం.. ఆగమాగం..
    కర్ణాటక అంటేనే కమీషన్ల రాష్ట్ర అన్న ముద్ర పడిపోయింది. కాంట్రాక్టర్లు ఏ పని చేసినా ప్రజాప్రతినిధులకు కమీషన్లు ఇవ్వాల్సిందే. దీంతో వాళ్లు కూడా కమీషన్లు పోగా మిగిలిన సొమ్ముతో నాసిరకంగా పనులు చేస్తున్నారు. ఇందుకు తాజాగా రాయచూర్‌ మార్కెట్‌ యార్డు నిదర్శనంగా నిలిచింది. అస్తవ్యస్త నిర్మాణంతో యార్డులో షెడ్లు ఉన్నా.. లేనట్లే ఉంది. వర్షపు నీరంతా దాన్యంపైనే పడింది. ఇక.. ప్లాట్‌ఫామ్‌ నిర్మాణం, ఫోరింగ్‌ కూడా ఎత్తు పల్లాలతో నిర్మించారు. దీంతో వర్షపు నీరు పోయే వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో అకాల వర్షానికి వరద మొత్తం యార్డును ముంచెత్తింది. ధాన్యపు రాశులన్నీ నీటిలో తేలియాడుతూ కనిపించాయి. కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతున్నా రైతులు చూస్తూ కన్నీరు పెట్టుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

    దేశమంతా ఇదే పరిస్థితి..
    ఇలాంటి పరిస్థితి ఒక్క కర్ణాటకలోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రైతుల పరిస్థితి ఇలానే ఉంది. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం కూడా చివరకు సొమ్ముగా మారి తన చేతికి అందుతుందన్న నమ్మకం లేని పరిస్థితి రైతులది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యాణా, ఒడిశా ఇలా ఏ రాష్ట్రం చూసుకున్నా ఇదే పరిస్థితి. ఇటీవల మహారాష్ట్రలో ఉల్లి రైతులు అయితే పెద్ద ఉద్యమమే చేశారు. మార్కెట్‌ యార్డులకు తెచ్చిన పంటలను కూడా కాపాడుకోలేని స్థితికి ఎవరిని నిందించాలి.

    మరోవైపు దళారుల దోపిడీ..
    ఒకవైపు రైతులు ప్రకృతి వైపరీత్యాలు, తెగులుళ్లను ఎదురించి పంటలు పండిస్తే.. మార్కెట్‌కు తెచ్చిన తర్వాత దళారులు చెప్పిన ధరకే అమ్ముకునే పరిస్థితి. కేంద్రం పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నా.. నాణ్యత, తేమ, ఇతర కారణాలతో దళారులు మద్దతు ధర చెల్లించడం లేదు. దీంతో పంటను నిల్వ చేసుకునే వెసులుబటు లేని రైతులు దళారి చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ ఏడాది పత్తి ధర పడిపోవడంతో తెలంగాణలో రైతులంతా పత్తిని ఇళ్లలోనే నిల్వ చేశారు. ఈ పరిస్థితిని గమనించిన దళారులు కుమ్మక్కై ధర పెంచడం లేదు. కారణం ఏంటంటే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం సాకుగా చెబుతున్నారు. దీంతో దాదాపు ఆరు నెలలుగా పత్తి రైతుల ఇళ్లలోనే నిల్వ ఉంది. మరోవైపు ఎండలుకు చిన్నపాటి నిప్పు పడినా పత్తితోపాటు ఇల్లు కాలి బూడిదైయ్యే పరిస్థితి. ఇక అకాల వర్షాలకు నిల్వ ఉంచిన పత్తితో తేమ వచ్చి.. నల్లబడి పోతోంది. నాణ్యత దెబ్బతింటోది. చివరకు దళారులనే ఆశ్రయించాల్సి వస్తోంది.

    మార్కెట్లకు ఆదాయం..
    పంటల విక్రయం ద్వారా మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు చేసే చెక్‌ పోస్టుల ద్వారా మార్కెట్లకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయినా యార్డుల్లో సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు అన్నదాత గోసను మాత్రం పట్టించుకోవడం లేదు. పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నామని సౌకర్యాలను గాలికి వదిలేశారు. దళారులు నిలువునా దోచుకుంటున్నా చోద్యం చూస్తున్నారు.

    చివరికి కన్నీరే..
    ఆరుగాలం రెక్కల కష్టం చేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట కళ్ల ముందే వరదలో కొట్టుకుపోతుండడంతో రైతుల పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరూ చలించిపోతారు. ప్రతీ కన్ను చెమరుస్తుంది. రెండు మూడు రోజుల్లో ధాన్యం అమ్మితేనే ఆ రైతు సాగు కోసం చేసిన అప్పులు తీరేది.. ఆ ధాన్యం అమ్మిన డబ్బులు వస్తేనే పిల్లల ఫీజులు కట్టేది.. ఆ డబ్బులతోనే ఏడాదంతా ఇల్లు గడిచేది. కానీ, చివరికి కన్నీరు తప్ప రైతులకు ఏమీ మిగలలేదు. పాలకుల నిర్లక్ష్యానికి, పాలనా వైఫల్యానికి కర్ణాటకలో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రైతులు ఇంత నష్టపోయినా ఎన్నికల బిజీలో ఉన్న నేతలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంత నష్టం జరిగినా.. ఎవరూ పట్టించుకోకపోయినా.. మళ్లీ చినుకు పడగానే రైతు పొలం బాట పట్టాల్సిందే. ఎందుకంటే రైతుకు ఎవుసం తప్ప ఏమీ తెలియదు మరి.