https://oktelugu.com/

Ballari: కర్నాటకలో బళ్లారి సీట్లు హాట్ గురూ..

గతంలో ఇదే నియోజకవర్గం నుంచి శ్రీరాములు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా మారడంతో నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2023 12:51 pm
    Follow us on

    Ballari: కర్నాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 224  నియోజకవర్గాలకు గాను రెండింట్లో మాత్రం హైటెన్షన్ నెలకొంది. గతంలో సన్నిహితంగా మెలిగిన గాలి జనార్థనరెడ్డి, బళ్లారి శ్రీరాముల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం శ్రీరాములు బీజేపీ సిట్టింగ్ మంత్రికాగా… గాలి జనార్ధనరెడ్డి బీజేపీ బహిష్కృత నేత. ఇప్పుడు బళ్లారిపై పట్టుకు ఇరువురు నాయకులు ప్రయత్నిస్తుండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పుడు ఈ ఇరువురు నాయకులు వేర్వేరు పార్టీల తరుపున బరిలో ఉండడంతో రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. కానీ ముఖాముఖీ పోటీకి మాత్రం దిగలేదు.

    గతేడాది డిసెంబర్ లో బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి ఆ తరువాత సొంతంగా పార్టీ పెట్టారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన..ప్రస్తుతం ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి నియోజకవర్గం నుంచి గాలి జనార్దన రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక అలాగే గాలి జనార్దన రెడ్డి భార్య లక్ష్మీ అరుణ  బళ్లారి నగరం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు దంపతులు కూడా కర్ణాటక ఎన్నికల బరిలో నిలిచారు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే గాలి జనార్దనరెడ్డి దంపతులు పోటీగా ఉన్న రెండు నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయడం విశేషం.

    బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి, బళ్లారి సిటీలో బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డి, కేఆర్ పీ పార్టీ అభ్యర్థిగా గాలి లక్ష్మీ అరుణ మధ్య గట్టిపోటీ ఉంది. జనార్దనరెడ్డికి స్వయాన సోదరుడే సోమశేఖర్ రెడ్డి. బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో మంత్రి బళ్లారి శ్రీరాములు పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అయితే బళ్లారి సిటీ, రూరల్ నియోజకవర్గాలను హైరిస్క్ గా పోలీసులు గుర్తించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా పెంచారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

    బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. బళ్లారిలో గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి లక్ష్మీ అరుణల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న మంత్రి బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర మధ్య గట్టిపోటీ ఉంది. బళ్లారి శ్రీరాములు, నాగేంద్ర ఇద్దరూ వాల్మీకి కులానికి చెందిన వారే. అయితే వాల్మీకి కుల సంఘ పెద్దలు అందరూ మంత్రి బళ్లారి శ్రీరాములకు మద్దతు ప్రకటించడం విశేషం. సిట్టింగ్ మంత్రి కావడంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి శ్రీరాములు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా మారడంతో నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.