Brahmaputra River : గంగ, యమునా, సరస్వతి, కృష్ణ, గోదావరి.. ఇలా ఏ నది చూసుకున్నా.. స్త్రీ పేర్లే ఉన్నాయి. ఇక వాటికి జరిగే పూజలు, పునస్కారాలు వేరే లెక్క. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కూడా నిర్వహిస్తారు.. వర్షాకాలం ఉప్పొంగితే నేతలు సారెలు సమర్పిస్తారు. కొన్నిచోట్ల అయితే ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు.. పుణ్య స్థానాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి వంటి పండుగల సందర్భాల్లో జరిగే వేడుకలయితే మామూలుగా ఉండవు. ఇప్పటివరకు దేశంలో ఉన్న నదులు మొత్తం కూడా స్త్రీ రూపాల గానే పరిగణిస్తున్నారు. వాటిని శక్తి స్వరూపాలుగా పూజిస్తున్నారు.. ఇలాంటి స్త్రీ నదులు పారుతున్న చోట ఒక పురుష నది కూడా ఉంది. కాకపోతే అది ఎటువంటి గుర్తింపునకు నోచుకోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతమైన నేపథ్యంలో ఈ నది ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని ప్రస్తావన వైరల్ గా మారడంతో చర్చనీయాంశమైంది.
దేశంలో నదుల చరిత్ర చాలా పురాతనమైంది. ఇప్పుడంటే పరిశ్రమల కాలుష్యం వల్ల వాటి శోభను కోల్పోయాయి కానీ.. ఒకప్పుడు నదులు తమ స్వచ్ఛతను కాపాడుకుంటూ పలు దిశల్లో ప్రవహించేవి. గంగా నుంచి మొదలు పెడితే గోదావరి వరకు అనేక పురాణాల్లో, చారిత్రాత్మక గాథల్లో వాటి ప్రస్తావన ఉంది. వాటి ప్రవాహం ఆధారంగానే భారతీయ నదులను స్త్రీలతో పోల్చారు. వాటన్నింటికీ స్త్రీ పేర్లు పెట్టారు. నదిని తల్లిగా, పవిత్రంగా పూజించడం మొదలుపెట్టారు. నదీ స్నానం చేస్తే సకల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం.
ఇంతటి ఐతిహ్యం ఉన్న మనదేశంలో బ్రహ్మపుత్ర పేరుతో ఒక పురుష నది కూడా ఉంది. ఈ నది అత్యంత ఆధ్యాత్మిక శోభ కలిగి ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. పుష్కర్ లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ నదిలో స్నానం చేయాలని ఒక నమ్మకం. ఈ నదిలో స్నానం చేయడం వల్ల శారీరక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రహ్మ దోషం తొలగిపోతుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ నది ప్రవాహం మూడు రోజులపాటు రక్తంలాగా ఎర్రగా కనిపిస్తుంది. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం బ్రహ్మపుత్ర నది బ్రహ్మ బిడ్డ అని నమ్ముతారు. బ్రహ్మదేవుడు గొప్ప రుషి అని, అయితే శంతనుడి భార్య అమోఘ అందానికి బ్రహ్మ మంత్ర ముగ్దుడయ్యాడని, వివాహం కూడా చేసుకున్నాడని తెరుస్తోంది. బ్రహ్మ, అమోఘాలకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడే నీరులా ప్రవహించాడని నమ్ముతారు. బ్రహ్మకు పుట్టిన బిడ్డ కాబట్టి అతడికి బ్రహ్మపుత్ర అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఈ నది 2,900 వందల కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. చైనాలోని టిబెట్ ప్రాంతంలోని మానస సరోవరం ఈ నదికి పుట్టినిల్లు. దీనిని టిబెట్లో యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు.
మానస సరోవరం నుంచి ఉద్భవించిన రెండవ నది ఇది. టిబెట్ లో పుట్టిన బ్రాహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తుంది. అనంతరం అస్సాం మీదుగా ప్రయాణించి బంగ్లాదేశ్ లో కి ప్రవేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నది రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ దక్షిణ వైపుగా ప్రయాణించి జమున నది పేరుతో దిగువ గంగానదిలో కలుస్తుంది. దీనిని పద్మా నది అని కూడా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది మరొక పాయ మేఘన నదిలో కలుస్తుంది. ఈ నదులు బంగ్లాదేశ్ లోని చాంద్ పూర్ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తాయి.