Kerala High Court: మహిళ గర్భం దాల్చినప్పటి నుంకే పుట్టబోయే బిడ్డ కోసం కాబోయే తల్లిదండులు కలలు కంటుంటారు. బాబు పుడితే ఏం చేయాలి.. పాప పుడితే ఎలా అలంకరించాలి. బాబుకైతే ఏపేరు బాగుంటుంది.. పాపకు ఎలాంటి పేరు సెలక్ట్ చేయాలని చర్చలు జరుపుతారు. ఈ రోజుల్లో నెట్టింట్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. నామకరణ మహోత్సవం, బిడ్డను ఇంటికి తీసుకెళ్లే అకేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అయితే కేరళలో మాత్రం ఆ పేరెంట్స్ బిడ్డ పేరు కోసం గొడవ పడ్డారు. వారి మధ్య సయోధ్య కుదరక పోవడంతో కోర్టును ఆశ్రయించారు. చివరకు న్యాయస్థానంలోనే నామకరణం చేయాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
కేరళకు చెందిన యువతి, యువకుడు నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2020లో ఈ జంటకు పాప పుట్టింది. తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పాప తల్లివద్దే ఉంటుంది.
జనన ధ్రువీకరణ కోసం..
అయితే పాపకు ఆస్పత్రి వారు ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌లో పేరు లేదు. భార్య భర్తల గొడవల్లో పడి పాపకు పేరు పెట్టడం కూడా మర్చిపోయారు. ఈ క్రమంలో మూడేళ్లు గడిచింది. చిన్నారికి పేరు మాత్రం పెట్టలేదు. స్కూల్‌లో జాయినింగ్‌కు బర్త్ సర్టిఫికెట్ మస్ట్ కావడంతో ఆ తల్లి ఈమేరకు పేరు పెట్టాలనుకుంది.
తల్లిదండ్రులిద్దరూ రావాలని..
అయితే పేరు నమోదుకు తల్లిదండ్రులిద్దరూ రావాలని అధికారి నిబంధన పెట్టాడు. ఆ మేరకు ఇద్దరూ ఓ రోజు సదరు అధికారి వద్దకు వెళ్లారు. అయితే పాపకు వాళ్లు వేర్వేరు పేర్లు సూచించారు. తాను సూచించిన పేరు పెట్టాలని భర్త, కాదు తాను చెప్పిన పేరే బాగుందని భార్య పట్టుపట్టారు. ఎంతకూ ఇద్దరు బెట్టు వీడలేదు.
చివరకు కోర్టుకు..
ఈ క్రమంలో సదరు అధికారి ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని సూచించాడు. దీంతో వేర్వేరుగా ఉంటున్న ఆ దంపతులు తమ బిడ్డ పేరు కోసం కోర్టుకు ఎక్కారు. విచారణ జరిపిన జస్టిస్ బెచు కురియన్ థామస్ తానే పేరు సూచిస్తానని దంపతులకు తెలిపాడు. దీనికి ఇద్దరూ అంగీకరించారు. దీంతో సంబంధిత శాక అధికారిని పిలిపించి కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఈ పనికి పూనుకుంది. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి.. పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.