DK Shivakumar : అశేష భారతావనిని కబళిస్తూ వస్తున్న కాషాయదళం ఒక వైపు…ముసురుకొస్తున్న కేసులు మరోవైపు..సొంత పార్టీని నిర్వీర్యం చేయాలన్న నేతలు ఇంకోవైపు..అయినా వెనక్కి అడుగు వేయలేదు.బెదిరింపులకు లొంగలేదు. అదరలేదు..బెదరలేదు. కలబడ్డాడు..నిలబడ్డాడు. ఆయనే డీకే శివకుమార్. ఎంత ఎత్తుకు ఎదిగినా అతడికి పార్టీయే ఫైనల్. పార్టీ ఆదేశాలకు అసలు సిసలు కట్టుబానిస. అందుకే హైకమాండ్ ఆదేశాల మేరకు ఏకంగా సీఏం పదవినే త్యజించారు. డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. చివరి వరకూ కుర్చీలాటలో ముందంజలో నిలిచినా పార్టీ ఆదేశాలతో వెనక్కి తగ్గిన సుశిక్షితుడైన కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్.
ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన శివకుమార్ 1985లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత సాధనూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. 1989లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అది మొదలు ఇప్పటివరకూ 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1990లో బంగారప్ప కేబినెట్ లో తొలిసారిగా మంత్రి అయ్యారు. 30 సంవత్సరాల పిన్న వయసులోనే అమాత్య పదవి దక్కించుకున్న నేతగా గుర్తింపు సాధించారు. 1999లో జేడీఎస్ నేత కుమారస్వామిని సాధనూరు నియోజకవర్గంలో ఓడించి రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు సాధించుకున్నారు. ఎస్ఎం కృష్ణ సర్కారులో మంత్రి పదవి దక్కించుకున్న శివకుమార్ దేవేగౌడ కుటుంబంతో ఉన్న వైరంతో 2004లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారులో మంత్రి పదవి దక్కలేదు. 2013లో సిద్ధరామయ్య కేబినెట్ లో చోటు దక్కింది.
సంక్షోభాల సమయంలో పార్టీని గట్టెక్కించే ట్రబుల్ షూటర్ గా, హేమాహేమీలను మట్టికరిపించే జెయింట్ కిల్లర్ గా శివకుమార్ కు పేరుంది. అందుకే పార్టీ హైకమాండ్ కష్టాల్లో ఉన్నప్పుడు పరిష్కార బాధ్యతలను శివకుమార్ కు అప్పగించింది. 2018లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ కు అల్లంత దూరంలో నిలిచిపోయింది. ఆ సమయంలో దేవేగౌడ కుటుంబంతో ఉన్న వైరాన్ని పక్కనపెట్టి చర్చలకు దిగారు శివకుమార్. కాంగ్రెస్ పార్టీని మోదీ, షా ద్వయం వెంటాడుతున్న వేళ ఉత్తరాధి రాష్ట్రాల్లో సంక్లిష్ణ పరిస్థితులను కూడా తనపై ఎత్తుకున్న నేత ఆయన. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సంక్షోభం తలెత్తినా, ఎమ్మెల్యేలకు రక్షణ కావాలన్నా హైకమాండ్ నుంచి వినిపించే మాట కూడా శివకుమారే.
2019 నుంచి కర్నాటక కాంగ్రెస్ సంక్షోభాలతో విలవిల్లాడుతున్న వేళ నేనున్నాను అంటూ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు శివకుమార్. కేపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రాష్ట్రం నలుమూలలా తిరిగి పార్టీని బలోపేతం చేశారు. బీజేపీ రూపంలో కష్టాలు, సంక్షోభాలు, సవాళ్లు ఎదురైనా వెరవకుండా పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేశారు. కన్నడ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసి దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి జవసత్వాలు నింపారు. అంతటి విజయాన్ని అందించిన ఆయన హైకమాండ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి కాంగ్రెస్ కు కట్టుబానిసలా వ్యవహరించారు. ‘కోర్టులో మనం ఎంతైనా వాదిస్తాం. కానీ చివరకు న్యాయమూర్తి తీర్పును పాటించాల్సిందే. తాను కూడా అంతే. పార్టీ హైకమాండ్ ఆదేశాలే నాకు ముఖ్యం’ అని పార్టీపై, హైకమాండ్ పై తన వినయ విధేయతలను పాటించిన వన్ అండ్ ఓన్లీ లీడర్ డీకే శివకుమార్.