BJP – Telugu Voters : కర్నాటక లో బీజేపీ ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. ప్రభుత్వంపై పెల్లుబికిన వ్యతిరేకత కాషాయ పార్టీని కొంపముంచింది. తెలుగోళ్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో సైతం బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. తెలుగు పార్టీలు ఎక్కడా ప్రత్యక్ష ప్రచారం చేయకపోయినా.. బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదపకపోయినా ప్రతికూల ఫలితాలు రావడం కాస్తా కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికితోడు వైసీపీ అంతర్గతంగా సహకారం అందించినా బీజేపీని గట్టెక్కించలేకపోయింది. తెలుగు ప్రజలు ప్రభావితం చూపే 49 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది కేవలం ఆరు స్థానాల్లోనే..
కేసీఆర్ మౌనం దాల్చినా..
తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ ఫైట్ చేస్తోంది. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయినా సరే బీజేపీని ఓడించాలని కానీ..జేడీఎస్ ను గెలిపించాలని కానీ కేసీఆర్ పిలుపునివ్వలేదు. తనకు ఆర్థిక సాయం చేస్తానని ఓ నాయకుడు దెబ్బేశాడని కుమారస్వామి చెప్పుకొచ్చారు. అది కేసీఆర్ కోసమేనన్న చర్చ నడిచింది. కారణాలేమైనా కానీ.. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ ప్రత్యర్థులకు ఎటువంటి సహకారం అందలేదు. కానీ బీజేపీ ఓటమి చవిచూడడం మాత్రం కాస్తా విస్తుగొల్పుతోంది. అది తెలుగు ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ఢిల్లీ పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నారు.
జగన్ ప్రత్యక్షంగా..
అయితే వైసీపీ తన అవసరాల కోసం బీజేపీకి సహకరించింది. ముఖ్యంగా జగన్ తన వ్యక్తిగత ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీకి మద్దతివ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందన్న వార్తలు వచ్చాయి. ఓ మంత్రి బెంగళూరులో మకాంపెట్టి మరీ క్యాంపెయిన్ నడిపినట్టు తెలుస్తోంది. అయినా సరే తెలుగు ప్రజలను బీజేపీ వైపు మరల్చలేకపోవడం ఓకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తెలుగు ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడాన్ని హైకమాండ్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీపై ప్రభావం..
కర్నాటకలోని ఎనిమిది జిల్లాలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్నారు. మొత్తం 49 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే అందులో బీజేపీ గెల్చుకుంది కేవలం ఆరు సీట్లనే. మొత్తం ఎనిమిది జిల్లాల్లో కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ బళ్లారి జిల్లాలో కూడా బీజేపీ ఖాతాలో ఒక్క సీటు కూడా పడలేదు. ఈ ఫలితాలు బీజేపీ హైకమాండ్ ను కూడా ఆశ్చర్య పరిచాయని అనుకోవచ్చు. ఇప్పుడు ఫలితాలతో ఏపీ రాజకీయాలు కూడా చర్చకు వస్తున్నాయి. వైసీపీ వైపు అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో వైసీపీ పేరు వినిపించడంతో అక్కడి ఓటమి బాధ్యతను సైతం ఆ పార్టీకే అంటగడుతున్నారు. ఏపీ విషయంలో బీజేపీ పునాలోచన పడడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.