Sudha Murty: రాజ్యసభకు సుధా మూర్తి.. మోడీ అనూహ్య నిర్ణయం కారణం ఇదే

పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు తగ్గించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. హఠాత్తుగా సుధా మూర్తిని రాజ్యసభకు పంపించడం వెనక కారణం ఏమై ఉంటుంది?

Written By: Suresh, Updated On : March 8, 2024 2:17 pm

Sudha Murty

Follow us on

Sudha Murty: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయల తగ్గిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలా ప్రకటించిన కొంతసేపటికే.. మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తిని నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ” రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi murmu) సుధా మూర్తిని (Sudha Murthy) ని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్య, విభిన్న రంగాలలో సుధా జీ చేసిన కృషి అపారమైనది. అత్యంత స్ఫూర్తిదాయకమైనది. ఆమె రాజ్యసభలో ఉండటం మన నారీశక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం. ఇది మన దేశ విధిని రూపొందించడంలో, మహిళల శక్తి, సామర్థ్యాన్ని నిరూపించడంలో ఉదాహరణగా నిలుస్తుంది. ఆమె అద్భుతమైన పార్లమెంట్ పదవీ కాలాన్ని కొనసాగించాలని” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పుడే ఎందుకు?

పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు తగ్గించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. హఠాత్తుగా సుధా మూర్తిని రాజ్యసభకు పంపించడం వెనక కారణం ఏమై ఉంటుంది? సుధా మూర్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఆమె నారాయణమూర్తి, ఇంకా కొందరితో కలిసి ఇన్ఫోసిస్ ప్రారంభించారు. ఇప్పటికీ ఆమె ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు చైర్ పర్సన్ గా ఉన్నారు. వివాద రహిత జీవితం, హుందాతనం, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించడం, పుస్తకాలు రాయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి సుధా మూర్తిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి. కేరళ రాష్ట్రంలో జరిగే ఓ వేడుకలో ఆమె ప్రతి ఏడాది పొంగలి వండుతారు. నిరాడంబరంగా అక్కడ జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఇంతటి ఉదాత్తమైన గుణం ఉన్న ఆమెను హఠాత్తుగా నరేంద్ర మోడీ రాజ్యసభకు నామినేట్ చేశారు. రాష్ట్రపతి కోటా అని పైకి చెబుతున్నప్పటికీ.. అంతిమంగా అది మోడీ నిర్ణయం. అందులో ఎటువంటి అనుమానం లేదు.. సుధా మూర్తి సొంత రాష్ట్రమైన కర్ణాటకలో 20 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో 18 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి ఎలాగైనా గత ఎన్నికల్లో లాగానే పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలని బిజెపి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందువల్లే సుధా మూర్తిని రాజ్యసభ కు నామినేట్ చేశారని తెలుస్తోంది.

సాధ్యమవుతుందా?

కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు అక్కడ అధికార పార్టీకే ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది. పైగా ఇటీవల నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజారిటీ పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటారని తేలింది. అదే ఇటీవల జరిగిన అక్కడి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో బిజెపి పూర్వ వైభవం సాధిస్తామని నమ్మకంతో ఉంది.. సమాజంలో ఉన్న విద్యాధికుల ఓటు బ్యాంకును దక్కించుకోవాలని బిజెపి ఆరాటపడుతోంది. అందులో భాగంగానే సుధా మూర్తికి రాజ్యసభ కేటాయించినట్లు తెలుస్తోంది. సుధా మూర్తిని రాజ్యసభకు కేటాయించినతమాత్రాన విద్యాధికులు ఓటు వేస్తారా అనేది ఒక డిబేటబుల్ ప్రశ్న. కానీ రాజకీయ పార్టీలు అన్నాకా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే నిర్ణయం తీసుకుంటాయి. ఇందులో నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడానికి లేదు.. రాజ్యసభ అంటేనే పెద్ద సభ కాబట్టి.. కాంట్రాక్టర్ల కంటే, మద్యం వ్యాపారుల కంటే.. సుధా మూర్తి నయమే కదా. పైగా ఆమెకు సేవ తత్పరురాలు అనే పేరు కూడా ఉంది. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా కర్ణాటకలో సానుకూల ఫలితాలు వస్తాయనే ఆశ కూడా బిజెపిలో ఉంది. సో మొత్తానికి మోడీ తీసుకున్న ఒక నిర్ణయంతో సుధా మూర్తి వార్తల్లో వ్యక్తి అయ్యారు. అన్నింటికీ మించి మహిళా దినోత్సవం రోజున రాజ్యసభ సభ్యురాలు కాబోతున్నారు.

రిషి సునక్ మధ్య వర్తిత్వం నడిపాడా?

ఇటీవల సుధా మూర్తి అల్లుడు, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి రిషి సునక్ ఇండియా వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. అది జరిగిన కొద్ది రోజులకే సుధా మూర్తి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. అంటే ఇందులో రిషి సునక్ ఏదైనా మధ్యవర్తిత్వం నడిపాడా? దానికి నరేంద్ర మోడీ ఓకే అన్నాడా? అందుకే సుధా మూర్తికి రాజ్యసభ సభ్యురాలి అవకాశం దక్కిందా? మీడియా విశ్లేషణలు ఇలాగే ఉంటాయి కానీ.. స్థూలంగా చెప్పాలంటే సుధా మూర్తి ఎంపిక సరైనది. అప్పుడప్పుడు మోదీ కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు. అందుకు సుధా మూర్తి ఎంపికే ఓ ఉదాహరణ.