సోషల్ మీడియా నియంత్రణకు కేంద్రం పలు కొత్త నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా సంస్థలన్నీ భారత్ లో తమ ఆఫీసులను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించే అధికారులు కూడా ఇండియాలోనే ఉండాలి. వీరు 24/7 అందుబాటులో ఉండాలి. అంతేకాదు.. ఫిర్యాదులను నిర్ణయించిన టైమ్ లోపు పరిష్కరించాలి. దీంతోపాటు అసభ్యకరమైన పోస్టులు.. అసత్యాలను ఎవరు ప్రచారం చేస్తున్నారు? అనే విషయాలను కూడా సంబంధించి సంస్థలే గుర్తించాలి. ఇవీ.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్. వీటిని అమలు చేయకపోతే దేశంలో ఆయా సంస్థల కార్యకలాపాలు కొనసాగబోవని స్పష్టం చేసింది.
దీనిపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అదుపు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వ్యకమతమవుతున్నాయి. అయితే.. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం సాగుతున్న విషయం కూడా కాదనలేనిది. అందుకే.. కేంద్రం ‘‘ఐటీ రూల్స్ -2021 గైడ్ లైన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్’’ పేరిట గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది.
అయితే.. ఈ నిబంధనలకు లోబడి పనిచేయడానికి సోషల్ మీడియా సంస్థలు చాలా కాలంగా వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నాయి. ఇవన్నీ అమలు చేయాలంటే.. కొత్తగా సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసులు తెరవడం నుంచి మొదలు ఫిర్యాదుల స్వీకరణ వరకు అన్నీ సజావుగా కొనసాగించాలంటే.. ఓ కొత్త వ్యవస్థనే నడిపించాల్సి ఉంటుంది. అందుకే.. ఆయా సంస్థలు అడుగు ముందుకు వేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం డెడ్ లైన్ విధిస్తూ అల్టిమేటం జారీచేసింది.
ఫిబ్రవరి 25న రూపొందించిన కొత్త నియమావళిని మే 25లోపు అమలు చేయాలని గడువు విధించింది. అంగీకరించకపోతే భారత్ లో వాటిని నిషేధిస్తామని హెచ్చరించింది. ఈ రోజుతో గడువు ముగిసింది. అయితే.. ఈ నిబంధనలను అంగీకరిస్తామని ఇప్పటి వరకు ఫేస్ బుక్, గూగుల్, వాట్సాప్ ప్రకటించాయి. ట్విటర్ మాత్రం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. మరి, ఏం జరుగుతుంది? అన్నది చూడాలి. మొత్తంగానైతే మెజారిటీ సోషల్ మీడియా కేంద్రం నిర్ణయానికి తలవంచినట్టైంది.