Siddaramaiah-Shivakumar Sworn : కర్నాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వారితో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేశారు. వీరితో కర్నాటక గవర్నర్ థావరచంద్ గహ్లెత్ ప్రమాణ స్వీకారం చేయించారు. 224 స్థానాలకు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలను సాధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 స్థానాలు అవసరం కాగా.. మ్యాజిగ్ ఫిగర్ కంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించింది. దీంతో ఎవరి మద్దతు సహాయం అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నెల 13న ఫలితాలు వెలువడగా.. సీఎం సీటు కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. గత కొద్దిరోజులుగా చర్చోప చర్చలు కొనసాగాయి. హైకమాండ్ పెద్దలు సైతం కొందరు సిద్ధరామయ్యకు..మరికొందరు డీకే శివకుమార్ కు సపోర్టుచేశారు. దీంతో ఉత్కంఠ కొనసాగింది. చివరకు పార్టీ అగ్రనేతలు బుజ్జగించడంతో డీకే శివకుమార్ మొత్తబడ్డారు. దీంతో సిద్ధరామయ్యకు లైన్ క్లీయర్ అయ్యింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రివర్గంలో ఆయన వర్గానికి పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుతానికి ఎనిమిది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మిగతా వారిని త్వరలో ఎంపిక చేయనున్నారు.
ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ, తమిళనాడు, రాజస్థాన్ , బిహార్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, అశోక్ గహ్లోత్, నితీశ్ కుమార్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సినీ నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ హాజరుకాకపొవడం విశేషం.
అనూహ్య పరిణామాల మధ్య సిద్ధరామయ్యకు సీఎం పదవి వరించింది. మొదటి నుంచి ఆయన పేరు వినిపిస్తున్నా డీకే శివకుమార్ సైతం ఆయన సరసన నిలిచారు. సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. 2018 నుంచి 2023 మే 19 వరకు కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయనకు కీలక శాఖలు దక్కుతాయని చెబుతున్నారు. మంత్రివర్గంలో డీకే శివకుమార్ వర్గానికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు ఆదేశాలు జారీ చేసింది.