Odisha: ఎన్నో వందల సంవత్సరాల వివాదం తర్వాత అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కల సాకారమైంది. బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట చేసుకుంది. రోజుకు లక్షల మంది భక్తులు తరలివస్తుండడంతో అయోధ్య క్షేత్రం కిటకిటలాడుతోంది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత.. అనంతరం ఏం జరుగుతుంది? ఏ దేవుడికి మళ్ళీ ఆ స్థాయిలో వేడుక జరపనున్నారు? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది. అయోధ్యలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత..రోజూ వార్తల్లో అయోధ్య ఉంటోంది. ఇక్కడికి సంబంధించిన ఏదో ఒక విషయం విశేషమవుతున్నది. అయోధ్య అనంతరం ఇప్పుడు ఒడిశా చర్చనీయాంశమవుతోంది.
ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల శివుడి విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని మార్చి 8న మహాశివరాత్రి పురస్కరించుకొని ఆవిష్కరించనున్నారు. ఈ శివుడి విగ్రహాన్ని బైత రాని నది తీరంలో బరహనాథ్ గుడి సమీపంలో ఏర్పాటు చేశారు. బరహ ఖేత్ర డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఈ మహా శివుడిని దర్శించుకునేందుకు నిర్వాహక కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. పైకి వెళ్లడానికి లిఫ్టులు కూడా నిర్మించింది. లిఫ్ట్ వద్దనుకునేవారు మెట్ల మార్గంలో కూడా శివుడిని దర్శించుకోవచ్చు. ఇక ఈ శివుడి విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్మించింది.. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ గుడి పరిసర ప్రాంతాల్లో పార్క్ కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా వాటర్ ఫౌంటేన్లు కూడా నిర్మించారు. భక్తుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు.
ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతం పర్యాటకానికి ప్రసిద్ధి. ఇక్కడ చాలావరకు పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా శివుడిని ఇక్కడ విశేషంగా కొలుస్తుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఆ వేడుకలు చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. జైపూర్ ప్రాంతంలో దశ్వ మేథ ఘాట్, వరాహ దేవాలయం, బరుణి ఘాట్, మా బైరాజా ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. ఈ ఆలయాలను సందర్శించేందుకు వచ్చే భక్తుల కోసం ఈ భారీ శివుడి విగ్రహం నిర్మించారు. భారీ శివుడి విగ్రహం నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయోధ్య రాముడి ప్రతిష్ట తరువాత.. భారీ శివలింగాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.