Seema Haider : అందరూ ఆమె భారతీయుడి ప్రేమ కోసం పాకిస్తాన్ వదిలి వచ్చిందని అనుకున్నారు. మొగుడు దుబాయిలో ఉంటే పరాయి దేశపు వ్యక్తి ప్రేమకు బానిసై సరిహద్దు దాటిందని అనుకుంటున్నారు. కొందరు తిడుతున్నారు. మరికొందరు ఇదేందని ఆశ్చర్యపోతున్నారు. పబ్జీతో పరిచయమైన వీరి బంధాన్ని వింతగా చూస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇందులో అంతకుమించిన గూడుపుఠాణి ఉందని అంచనావేస్తున్నారు. తాజా విషయాల్లో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి.
పబ్జీతో పరిచయమై భారత్ కు వచ్చిన పాకిస్తాన్ వివాహిత సీమా విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భర్త దుబాయ్ లో పనిచేస్తుండగా.. నలుగురు పిల్లలతో ఈమె పాకిస్తాన్ లో ఉంటోంది. భారతీయుడి ప్రేమలో పడి సరిహద్దు దాటి వచ్చేసి నోయిడాలోని ప్రియుడితో కలిసి ఉంటోంది.
భారత్ కు వచ్చి కాపురం చేస్తున్న ‘సీమా’ను యూపీ ఏటీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈమెకు ఢిల్లీలో మరికొంత మందితో పబ్జీ పరిచయాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. విచారణలో సీమా తెలివిగా వ్యవహరిస్తోందని.. ఆమె ఆంగ్ల ఉచ్ఛారణ సైతం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసినట్లు సమాచారం.

సీమా పాకిస్తాన్ ఏజెంట్ అని ముంబై పోలీసులకు మెసేజ్ రావడంతో ఆమె వ్యవహారంపై నిఘా వర్గాలు దృష్టిసారించాయి. ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం , ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సీమకు గల సంబంధాలపై యూపీఏటీఎస్ , ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆరాతీస్తోంది.
మే నెలలో నేపాల్ సరిహద్దు గుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి నివసిస్తున్నారు. వీసా లేకుండానే ఆమె భారత్‌లోకి ప్రవేశించడంపై కూడా సోదాలు జరుగుతున్నాయి.
ఇంతలో ఆమె పాకిస్తాన్ గుర్తింపు కార్డు యొక్క ప్రామాణికతపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. సాధారణంగా పుట్టినప్పుడు పొందే ఐడీ కార్డ్ సెప్టెంబర్ 20, 2022న జారీ చేయబడింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఆమె పాకిస్థాన్ పౌరసత్వ ఐడీ కార్డ్‌ని పొందడంలో జాప్యంపై దర్యాప్తు చేస్తోంది.
సీమా హైదర్ (30) గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న తన 22 ఏళ్ల భాగస్వామి సచిన్ మీనాతో కలిసి జీవించడానికి మేలో నేపాల్ నుండి బస్సులో తన నలుగురు పిల్లలతో సహా భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ జంట మొదట 2019లో పబ్ జీ ద్వారా పరిచయమయ్యారు. జూలై 4న, అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు సీమా హైదర్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిద్దరికీ స్థానిక కోర్టు జూలై 7న బెయిల్ మంజూరు చేసింది. ఆమె నలుగురు పిల్లలతో కలిసి రబుపురా ప్రాంతంలోని ఒక ఇంట్లో నివసిస్తున్నారు.