టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆసీస్ సిరీస్ నుంచి మంచి ఫామ్ కనబరుస్తున్న పంత్ అదే దూకుడును ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ కంటిన్యూ చేశాడు. శ్రేయాస్ అయ్యార్ గాయంతో మేనేజ్ మెంట్ పంత్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.
గతేడాది ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయ్యర్ సారథ్యంలో ఆరంభం నుంచి అదరగొట్టిన ఢిల్లీ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో చతికిలపడింది. ఈ సీజన్ లో ఢిల్లీకి పంత్ కెప్టెన్ గా వ్యవహరించడం.. ఆ జట్టును మరింత దూకుడుగా మార్చింది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఓ చిన్న తప్పిదంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి కారణమయ్యాడు.
కోల్ కతా విజయానికి 42 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన దశలో స్పిన్నర్ లలిత్ యాదవ్ తో బౌలింగ్ చేయించడం ద్వారా పంత్ తప్పు చేశాడని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. ఆ ఓవర్ నితీశ్ రాణా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదగా.. దినేశ్ కార్తీక్ కూడా ఓక ఫోర్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్ లో 20 పరుగులు వచ్చాయి. సమీకరణం 36 బంతుల్లో 32 పరుగులుగా మారిపోయింది. ఒకవేళ ఆ ఓవర్ ని ఫాస్ట్ బౌలర్ నార్జ్ తో వేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.