Republic Day 2024: మనదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఆగస్టు 15న ఎలాగైతే త్రివర్ణ పతకాలు రెపరెపలాడుతాయో.. జనవరి 26న కూడా అదే స్థాయిలో జాతీయ జెండాలు రెపరెపలాడుతాయి. ఇక మన దేశంలో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగిరిన అనంతరమే దేశంలో ఇతర ప్రాంతాల్లో జెండా వందనం వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఎర్రకోటపై ఆగస్టు 15న ప్రధానమంత్రి జెండా ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 26న మాత్రం ఆయన జాతీయ జెండా ఎగరవేయరు. ఎర్రకోట పై ఉన్నప్పటికీ కూడా ఆయన జెండా వందనం వేడుకల్లో మాత్రమే పాల్గొంటారు. ఇలా ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆగస్టు 15న జెండా పండుగ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగరవేస్తారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. వివిధ శకటాల ప్రదర్శనను తిలకిస్తారు. అయితే జనవరి 26న మాత్రం ఆయన ఆనవాయితీ కొనసాగించరు. ఇందుకు కారణం లేకపోలేదు. దీని గురించి చాలా మందికి తెలియదు. దీని వెనుక దశాబ్దాలనాటి అవాయితీ ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా కర్రకు దిగువ భాగంలో కట్టిన త్రివర్ణ పతాకాన్ని తాడుతో పైకి లాగి ఆవిష్కరిస్తారు. వలస పాలన నుంచి భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందింది అని చెప్పడానికి ఇది సంకేతం. అయితే గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా కర్రకు ఎగువన కట్టి ఉన్న పతాకాన్నే రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. అంటే అప్పటికే స్వాతంత్రం పొందిన దేశంలో రూపొందించిన రాజ్యాంగం అమల్లో ఉంది.. దానిని ఆ దేశ ప్రజలు అనుసరిస్తున్నారు అని చెప్పడానికి ఇది సంకేతం.. ఇక భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆగస్టు 15కు మాత్రమే కాదు జనవరి 26 కూడా విశేషమైన ప్రాధాన్యం ఉంది. 19 30 లో సరిగా ఇదే రోజున తొలిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. దేశానికి పూర్తిస్థాయిలో స్వాతంత్రాన్ని సాధించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీంతో అనేక పోరాటాల అనంతరం స్వాతంత్రం పొందిన తర్వాత.. రాజ్యాంగ కర్తలు జనవరి 26న రాజ్యాంగాన్ని దేశంలో అమలులో పెట్టారు.
ఇక ప్రస్తుతం మన దేశం 75వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సైనిక దళాలు పరేడ్ నిర్వహించాయి. వివిధ రాష్ట్రాల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. విద్యార్థిని విద్యార్థులు చేసిన శాస్త్రీయ నృత్యాలు భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పాయి.. కాగా ఈ వేడుకలను ఉద్దేశించి గురువారమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని చెప్పారు. ఈ సందేశంలో అయోధ్య విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.