ఏడాది మొత్తం చదివి.. చదివిన దాన్ని మొత్తం గుర్తుంచుకొని.. పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ఒకింత ఇబ్బందే.. పరీక్షలప్పుడు చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. చదివినది గుర్తు రాకపోవడంతో పరీక్షల్లో ఫెయిల్ అవుతుంటారు. లేదా తక్కువ మార్కులు సాధిస్తుంటారు. దీనికి తోడు ర్యాంకులు, మార్కులు అంటూ విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తుంటారు. తోటి విద్యార్థులతో పోల్చుతూ నానా అంటూ ఉంటారు. ఇలాంటివి విద్యార్థులలో ఆత్మ న్యూనతకు దారి తీస్తాయి. బలహీనమైన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకునే విధంగా ప్రేరేపిస్తాయి. అయితే ఒక దేశానికి అక్కడి యువతే ప్రధాన బలం కాబట్టి.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి ఒక చిట్కా చెప్పారు.
విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీలోనే భారత మండపంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏడవ ఎడిషన్ నిర్వహిస్తున్నారు. పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులను కేంద్ర విద్యా శాఖ ఎంపిక చేసింది. నవోదయ, సైనిక్, ఏకలవ్య, కేంద్రీయ, ఇతర ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష పే చర్చ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రోగ్రెస్ కార్డును తమ విజిటింగ్ కార్డుగా పరిగణించవద్దని సూచించారు. విద్యార్థులను ఇతరులతో పోల్చి చూడవద్దని సూచించారు. విద్యార్థులు ఇతరులతో పోటీ పడకుండా తమతో తామే పోటీ పడాలని సూచించారు. అప్పుడే విద్యార్థుల్లో ఆత్మ న్యూనత తగ్గుతుందని పేర్కొన్నారు.. పరీక్షల సమయంలో మార్కులు, ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేయొద్దని ప్రధాని సూచించారు. పరీక్ష పే చర్చ అంటే నాలుగు మాటలు మాట్లాడటం కాదని.. పరీక్షలు అంటే భయం లేకుండా చేయడమే దీని అసలు ఉద్దేశం అని ప్రధాని పేర్కొన్నారు. యువతే ఈ దేశం భవిష్యత్తు అని.. వారిని కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు. వారు చదువుతున్న తరగతులు , వారి భవిష్యత్తు లక్ష్యాలు తెలుసుకున్నారు. మధ్య మధ్యలో చలోక్తులు విసురుతూ విద్యార్థులను నవ్వించే ప్రయత్నం చేశారు. ” పరీక్ష పే చర్చ నాకు కూడా ఒక పరీక్ష లాంటిదే. నేను దేశానికి ప్రధానమంత్రి అయినంత మాత్రాన మీ ముందు మాట్లాడాలి అంటే భయం వేస్తుంది. ఎందుకంటే మీ పిల్లల మనస్తత్వం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పరీక్ష పే చర్చతో నాలో ఉన్న భయం కూడా పోతుంది. ఒత్తిడి అనేది ఎట్టి పరిస్థితుల్లో మీ దరిచేరకూడదు. అది మీ సామర్ధ్యాలను ప్రభావితం చేయకూడదు. మీరు ఏ ప్రక్రియలోనైనా క్రమంగా అభివృద్ధి చెందాలి” అని మోడీ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అంతకుముందు కార్యక్రమాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ” పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి ఏడవ ఎడిషన్ లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. మీతో సంభాషించేందుకు ఆయన చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. మీతో మాట్లాడటం అంటే ప్రధాన మంత్రికి చాలా ఇష్టం. అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంలో మార్చేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం కాబట్టి.. మిమ్మల్ని మీరు శక్తివంతులుగా ఎలా తయారు చేసుకోవాలో నేర్పించేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల పరీక్ష పే చర్చ ఒక ప్రజా ఉద్యమం లాగా రూపుదిద్దుకుంది” అని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఇక అంతకుముందు భారత మండపంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ఎగ్జిబిషన్లను ప్రదర్శించారు . ఈ సందర్భంగా ఆ ప్రదర్శనలను చూసి నరేంద్ర మోడీ అబ్బురపడ్డారు. ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్లి ప్రదర్శన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను భుజం తట్టి అభినందించారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ విద్యార్థులను అభినందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.