National Media Fake Updates : కర్నాటక పీఠముడి వీడడం లేదు. కానీ జాతీయ మీడియా మాత్రం తెగ హడావుడి చేస్తోంది. సిద్ధరామయ్య సీఎం, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం అంటూ ప్రచారం ప్రారంభించింది. కానీ దీనిపై స్పష్టత రావడం లేదు. అధికారిక ప్రకటన వెలువడలేదు. కర్నాటక ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడ్డాయి. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113ను ఆ పార్టీ దాటింది. దీంతో ఎవరి మద్దతు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, టీపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గట్టిగానే కృషిచేశారు. నేతలంతా సమన్వయంతో వ్యవహరించడం వల్లే గెలుపు సాధ్యమైంది. అయితే అటు సిద్ధరామయ్య, ఇటు శివకుమార్ ల మధ్య గట్టిపోటీ నెలకొంది.
రాహుల్ గాంధీతోపాటు ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సిద్ధరామయ్యకు సపోర్టు చేసినట్టు తెలిసింది. సోనియా గాంధీతోపాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే… డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు తెలిసింది. దీనిపై స్పష్టత రాకపోయినప్పటికీ ప్రమాణస్వీకారానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు బెంగళూరు నగరంలోని కంఠీరవ ఔట్‌డోర్ స్టేడియంలో ప్రభుత్వాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అతిథులు, ఎమ్మెల్యేలు, సాధారణ ప్రజానీకంతోపాటు మొత్తం 50 వేల మందికి సరిపడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
అయితే సిద్ధరామయ్య వర్గీయులు, అనుచరులు తెగ హడావుడి చేస్తున్నారు. ప్రమాణస్వీకారం ఏర్పాట్లలో వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. సిద్ధరామయ్యకే ఎక్కువ మొగ్గు ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తుండడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. మరోవైపు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవచ్చే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామనగర నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. డీకే మద్ధతుదారులు ఆందోళనలు చేపట్టవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు అందాయి.
ఇంకా సీఎం పేరు ఖరారు కాలేదని.. అవన్నీ ఫేక్ అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తప్పుడు ప్రచారాలను తెరదించుతూ కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి, పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అనూహ్య ప్రకటన చేశారు. సీఎం అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం జరగలేదని వెల్లడించారు. సీఎం ప్రమాణస్వీకారానికి సంబంధించి ఫేక్ డేట్లు ప్రచారంలో ఉన్నాయన్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అధికారిక ప్రకటన వరకూ ప్రచారాలను నమ్మవద్దని కోరారు.