https://oktelugu.com/

Central Cabinet : కేంద్ర కేబినేట్‌లో ఎన్ని‘కల్లోలం’: కీలక మంత్రులు ఔట్‌

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుకూలం గా.. జూలై 3నాటి భేటీ తర్వాత పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే అది కేవలం కేబినెట్‌ మంత్రులకు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2023 / 10:41 PM IST
    Follow us on

    Central Cabinet : కర్ణాటక ఎన్నికల్లో పరాజయం.. మణిపూర్‌లో కల్లోలం.. తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలు.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు.. ఈ ఏడాది ఆఖరులో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్కొక్కటి ఒక్కో అగ్ని పరీక్ష.. వీటిలో నెగ్గాలంటే మాములు విషయం కాదు. దీనికోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారీ కసరత్తే చేసింది. ఏకంగా ఒక సమగ్రమైన బ్లూప్రింట్‌ను రూపొందించుకుంది. దీని ప్రకారం.. జూలై మొదటి వారంలోపు కేంద్ర కేబినెట్‌లోనూ, పార్టీ పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయుల్లోనూ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి దాకా.. ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. చర్చలు కూడా జరిపారు.

    కేబినేట్‌లో మార్పులు

    ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన చర్యలు తీసుకోవడంతోపాటు.. ఎన్నికలకు అనువుగా జూలై మూడో వారంలో జరిగే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోపే కేంద్ర కేబినెట్‌లోనూ మార్పులు చేయాలని వారి భేటీలో నిర్ణయించారు. జూలై 3న కేంద్ర మంత్రిమండలి పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ భేటీలో.. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్మడి పౌరస్మృతిపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఆ భేటీ తర్వాత అనేకమంది మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

    ఆ భేటీ తర్వాత..

    ఇక, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుకూలం గా.. జూలై 3నాటి భేటీ తర్వాత పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే అది కేవలం కేబినెట్‌ మంత్రులకు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. సహాయ మంత్రులనూ మార్చే అవకాశం ఉందని, కొందరు సహాయమంత్రుల పనితీరు సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనే కింది నుంచి పైదాకా ఎదిగి, క్యాబినెట్‌లో ప్రస్తుతం శక్తిమంతమైన మంత్రిగా పేరొందిన ఒక నేతకు సైతం పార్టీ బాధ్యతలు అప్పగించి వెనక్కి పంపించనున్నట్టు సమాచారం.

    టెక్నోక్రాట్స్‌కు చోటు ఉండదు
    పశ్చిమబెంగాల్‌ నుంచి కేంద్రంలో ప్రస్తుతం నలుగురు సహాయమంత్రులు ఉండగా.. వారి సంఖ్యను రెండుకు తగ్గించే అవకాశం ఉంది. అశ్వినీవైష్ణవ్‌ వంటి టెక్నోక్రాట్స్‌కు చోటు ఉండదని.. నిర్ణయాలన్నీ పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్  గఢ్‌ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. వారిలో ఎవరినైనా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ 2022లో క్యాబినెట్‌లో చోటు కో ల్పోవడం, భోపాల్‌లో జరిగిన కార్యకర్తల భేటీలో ప్రధాని మోదీ పస్మాందా ముస్లింల గురించి ప్రస్తావించడం వంటి పరిణామాలనేపథ్యంలో.. ఒక మైనారిటీ ఎంపీకి కూడా మంత్రిగా అవకాశం కల్పించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. కాగా.. కేంద్ర మంత్రిమండలి విస్తృత మంత్రివర్గ సమావేశం ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఇదే కన్వెన్షన్‌ సెంటర్‌లో జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది.