https://oktelugu.com/

Rameswaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో.. కీలక విషయాలు వెలుగులోకి

రామేశ్వరం కేఫ్ బెంగళూరులో చాలా ఫేమస్. ఐటి ఉద్యోగులు ఇక్కడ టిఫిన్ తినడానికి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఎప్పటికీ జన సమ్మర్థంగా ఉంటుంది. బెంగళూరులో అలజడి సృష్టించేందుకు దుండగులు ఈ ప్రాంతంలో బాంబును అమర్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 3, 2024 / 01:25 PM IST

    Rameswaram Cafe Blast

    Follow us on

    Rameswaram Cafe Blast: దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించడంతో.. బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. సిసి ఫుటేజ్ పరిశీలించారు. మరోవైపు ఈ ఘటన పై ఉగ్ర అనుమానాలు వ్యక్తం కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగింది. దీంతో అటు రాష్ట్రం, ఇటు కేంద్రం వెంట వెంటనే స్పందించడంతో ఈ ఘటన వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగు చూశాయి. మాస్క్, క్యాప్ ధరించిన వ్యక్తి బస్సులో వచ్చాడు.. రామేశ్వరం కేఫ్ లోకి వెళ్ళాడు. అక్కడ ఇడ్లీ తీసుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన కొంత సమయానికే బాంబు పేలింది. ఆ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.

    రామేశ్వరం కేఫ్ బెంగళూరులో చాలా ఫేమస్. ఐటి ఉద్యోగులు ఇక్కడ టిఫిన్ తినడానికి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఎప్పటికీ జన సమ్మర్థంగా ఉంటుంది. బెంగళూరులో అలజడి సృష్టించేందుకు దుండగులు ఈ ప్రాంతంలో బాంబును అమర్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. బాంబు పేలుడు తీవ్రత తక్కువ కావడంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించలేదు. అదే ఆ బాంబు తీవ్రత ఎక్కువగా ఉంటే నష్టం అంచనా వేయడానికి వీలు లేకుండా ఉండేది. బాంబు పేలిన సమయంలో రామేశ్వరం కేఫ్ లో సుమారు వంద మంది దాకా ఉన్నట్టు అధికారులు అంటున్నారు.

    సిసి ఫుటేజ్ ద్వారా క్యాప్, మాస్క్ ధరించిన వ్యక్తిని కనిపెట్టిన దర్యాప్తు బృందాలు.. అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అతడి ఉద్దేశం ఏమిటి? అతడి వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో వివరాలు సేకరిస్తామని దర్యాప్తు బృందాలు అంటున్నాయి.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు బృందాలు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నాయి.. వారిని బెంగళూరు పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా విచారిస్తున్నాయి. విచారణలో భాగంగా వారు చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనలో ఏదైనా ఉగ్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామేశ్వరం కేఫ్ ఘటన జరిగిన తర్వాత హైదరాబాదులోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ మాదాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రామేశ్వరం కేఫ్ లో భద్రతను మరింత పెంచారు. సిపి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే నగరంలో పలు సున్నిత ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఘటనలో నిందితులు ఎవరున్నా విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు.