KCR- National Politics : డబ్బు దర్పంతో, అధికార గర్వంతో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆకాశం మీద ఉన్న కేసీఆర్ ఒక్క కర్ణాటక ఫలితంతో నేలకు దిగి వచ్చారు. ఇన్ని రోజులు దేశంలో చక్రం తిప్పుతా, ఢిల్లీలో గత్తర లేపుతా అని మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు సొంత ఇల్లును చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ఆరు నెలల క్రితమే జాతీయ పార్టీగా ప్రకటించుకుని భారత రాష్ట్ర సమితి అవతారం ఎత్తిన కేసీఆర్.. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా చక్రం తిప్పబోతున్నట్టు ప్రచారం చేసుకున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడమే కాకుండా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో శాఖలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో ఏకంగా మూడు చోట్ల సమావేశాలు నిర్వహించారు. భోకర్ మార్కెట్ కమిటీ లోనూ పోటీ చేశారు.. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోయిందని, బిజెపికి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని లెక్కలు వేసుకొని, ఇల్లు వదిలిపెట్టి, రచ్చ గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
కర్ణాటక పటాపంచలు చేసింది
అయితే ఇన్ని అంచనాలు వేసుకున్న కేసీఆర్ ను కర్ణాటక ఫలితం నేలకు దించింది. అంతేకాదు డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభంజనం లాగా మారి గత 40 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సాధించనన్ని సీట్లను ఇచ్చేసింది. దీంతో వరుస ఓటములతో తిరోగమనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కర్ణాటక గెలుపును కూడా తెలంగాణ ప్రాంతం ఊరూరా సంబరాల లాగా చేసుకుంది. అయితే మారిన పరిస్థితిని చూసి భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా అప్రమత్తమైంది.. కర్ణాటక తరహా లోనే తెలంగాణలోనూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇదే క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన కేసీఆర్.. కర్ణాటక లాగే ఇక్కడ కూడా ప్రతిపక్షానికి ఓట్లు పోటేత్తుతాయని భావిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు అక్కడ బిజెపి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని కెసిఆర్ ముందే కమిట్ అయ్యారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత సునామిలాగా విరుచుకుపడుతుందేమోనని అధికార పక్షంలో భయం మొదలైంది. అందువల్లే ఈసారి చాలామంది నేతలకు టికెట్లు ఇవ్వకపోవచ్చు అనే సంకేతాలు మొదలయ్యాయి.
జాతీయ దుకాణం బంద్
ఇన్ని ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో కొన్ని రోజులపాటు జాతీయ దుకాణం బంద్ పెట్టాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమకు 50 శాతం ఓటు బ్యాంకు ఉందని, 60 లక్షల సభ్యత్వాలు ఉన్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తమదని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపడతామని బయటకు చెబుతున్నప్పటికీ.. అంతర్గతంగా భారత రాష్ట్ర సమితిలో భయము మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను సరి చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వారు అభిప్రాయపడుతున్నారు. ఇకపై జాతీయ రాజకీయాల్లో దృష్టి తగ్గించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయం పైనే పూర్తి శక్తి యుక్తులు కేంద్రీకరించాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తామని అప్పట్లో కెసిఆర్ ప్రకటించారు. అంతేకాదు జెడిఎస్ చీఫ్ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పారు. కానీ ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పోటీ చేయలేదు. కుమారస్వామికి అనుకూలంగా ప్రచారం కూడా చేయలేదు. కానీ మహారాష్ట్రలో మాత్రం మూడు చోట్ల సభలు సమావేశాలు నిర్వహించింది. చాలామంది నాయకులను చేర్చుకుంది. ఒక యువకుడికి ఏకంగా ముఖ్యమంత్రి ప్రైవేటు కార్యదర్శి పోస్ట్ ఇచ్చింది.. ఇక కర్ణాటక విషయంలో జెడిఎస్ఎన్నికల్లో 37 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే.. ఈసారి 19 స్థానాలకు పరిమితమైంది. అయితే కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉంటుందా అనే విషయం కన్నా ప్రభుత్వ వ్యతిరేకత పైనే కెసిఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన చేయించుకున్న సర్వేల్లో కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గట్టిగానే కనిపించినట్టు తెలుస్తోంది. ఇక దీనిని ఎలా అధిగమించాలనే విషయంపై ముఖ్యమంత్రి మల్ల గులాలు పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ” ఇక జాతీయ రాజకీయాలు కాదు. ముందు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం. జాతీయ రాజకీయాలపై దృష్టి పెడదాం అంటూ” అనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టు ప్రగతి భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kcr is a full stop to national politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com