https://oktelugu.com/

DK – Siddu: డీకే – సిద్దూ.. కన్నడనాట కాంగ్రెస్‌ 50:50 కాంప్రమైజ్‌ ఫార్ములా  

ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాల్సి ఉంటుందనే ఫార్ములా కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. దీన్నే ఖాయం చేస్తారనే ప్రచారం కర్ణాటక రాజకీయాల్లో ఉంది. ఈ ఫార్ములాకు వారిద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 14, 2023 / 12:56 PM IST
    Follow us on

    DK – Siddu: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 136 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికిపైగా ఓట్ల షేర్‌ను సాధించింది కాంగ్రెస్‌. 1989 తరువాత ఈస్థాయి ఓట్‌ షేర్‌ను కాంగ్రెస్‌ అందుకోవడం ఇదే తొలిసారి. అధికార బీజేపీ 118 నుంచి 65 స్థానాలకు పడిపోయింది బీజేపీ సంఖ్యాబలం. ఈ పార్టీకి లభించిన ఓట్ల 35.9 శాతమే. ఈ ఓటమి అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సారథ్యంలోని కేబినెట్‌లో 11 మంది మంత్రులు ఓడిపోవడం బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. జనతాదళ్‌ (సెక్యులర్‌)–19, ఇతరులు–4 స్థానాల్లో గెలిచారు.
    సమష్టిగా విజయం..
    కర్ణాటకలో విజయం సాధించడానికి కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్రంగా శ్రమించింది. ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఏఐసీసీ అధినేత మల్లికార్జునఖర్గె, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే.శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయగలిగారు. హైకమాండ్‌ మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు క్యాడర్‌ను సమన్వయం చేసుకోగలిగారు.
    ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఫార్ములా..
    ఇవ్వాళ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం కానుంది. తమ నాయకుడిని ఎన్నుకోనుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే.శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య మధ్య షేరింగ్‌ ప్రతిపాదనలు తెర మీదికి వచ్చాయి. డీకే శివకుమార్‌ – కనకపుర, సిద్ధరామయ్య – వరుణ నుంచి విజయం సాధించారు. ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాల్సి ఉంటుందనే ఫార్ములా కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. దీన్నే ఖాయం చేస్తారనే ప్రచారం కర్ణాటక రాజకీయాల్లో ఉంది. ఈ ఫార్ములాకు వారిద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది. డాక్టర్‌ జి.పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా అయిదేళ్ల కాలం పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.