ISRO Mission Impossible : చంద్రుడు చేతికి చిక్కాడు. తర్వాత సూర్యుడే.. “ఇస్రో మిషన్” ఇంపాజిబుల్!

దేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మరి నెక్స్ట్‌ ఏంటి? ఇస్రో చేపట్టబోతున్న తదుపరి ప్రాజెక్టులేంటి? అంటే..

Written By: Rocky, Updated On : August 24, 2023 9:06 pm
Follow us on

ISRO Mission Impossible : యావత్ భారత దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్‌-3 విజయవంతమైంది. పట్టువదలని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి నేలను ముద్దాడింది. దేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మరి నెక్స్ట్‌ ఏంటి? ఇస్రో చేపట్టబోతున్న తదుపరి ప్రాజెక్టులేంటి? అంటే.. ఉన్నాయ్‌, చాలా ఉన్నాయ్‌. ఈ ప్రాజెక్టులతో ఇస్రో చాలా బిజీగా ఉండబోతోంది.

ఆదిత్య ఎల్‌1

చందమామపై అడుగు పెట్టిన ఇస్రో తదుపరి లక్ష్యం సూర్యుడే. ఈ మిషన్‌లో భాగంగా మన శాస్త్రజ్ఞులు పీఎస్ ఎల్వీ సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. 1412 కిలోల బరువుండే ఈ ఉపగ్రహం.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి ఎల్‌1 పాయింట్‌ (సూర్యుడికి-భూమికి నడుమ ఉండే పాయింట్‌ ఇది. దీన్ని లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 అంటారు) వద్ద కక్ష్యలోకి చేరుకుని సౌరతుఫాన్ల సమయంలో సౌర వాతావరణం ఎలా ఉంటుందో అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ.378 కోట్లు.

నిసార్‌

ఇస్రో, నాసా కలిసి సంయుక్తంగా చేపడుతున్న దిగువ భూకక్ష్య అబ్జర్వేటరీ మిషన్‌ ఇది. నిసార్‌ అంటే.. నాసా-ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి 12 రోజులకొకసారి భూమిని మ్యాప్‌ చేస్తుంది. 2024 జనవరిలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.12,379 కోట్లు. భూ పర్యావరణ వ్యవస్థలో మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, భూగర్భజలాల స్థితిగతులు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత పేలుళ్ల వంటి ముప్పుల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.

స్పేడెక్స్‌

స్పేడెక్స్‌ అంటే.. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పరిమెంట్‌. రెండు వ్యోమనౌకలను ఒకదానితో మరొకటి కలపడం, ఫార్మేషన్‌ ఫ్లయింగ్‌ వంటివి దీని లక్ష్యాలు. 2024 మూడో త్రైమాసికంలో రూ.124.47 కోట్ల వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు.

మంగళ్‌యాన్‌ 2

మంగళ్‌యాన్‌ 1 ద్వారా ఇప్పటికే కుజుడి కక్ష్యలో మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్‌)ను ప్రవేశపెట్టిన ఇస్రో.. వచ్చే ఏడాది మంగళ్‌యాన్‌-2 ప్రాజెక్టు చేపట్టి మామ్‌-2ను కుజుడి కక్ష్యలోకి పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

గగన్‌యాన్‌ 1, 2, 3

భారతదేశం చేపట్టబోయే తొలి మానవ స్పేస్‌ మిషన్‌ గగన్‌యాన్‌. భూమికి 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను పంపి, 3 రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం దీని లక్ష్యం. అయితే, తొలి రెండు గగన్‌యాన్‌లూ (జీ1, జీ2) మానవరహిత మిషన్లు. మూడోది హెచ్‌1 మిషన్‌. అంటే హ్యూమన్‌1 మిషన్‌. ఈ ప్రాజెక్టు విలువ రూ.9,023 కోట్లు.

శుక్రయాన్‌ 1

కుజుడి కక్ష్యలో ఆర్బిటర్‌ (మామ్‌)ను ప్రవేశపెట్టినట్టే.. శుక్రగ్రహ కక్ష్యలోకీ ఒక ఆర్బిటర్‌ను పంపి ఆ గ్రహంపై పరిశోధనలు చేసే లక్ష్యంతో ఇస్రో శుక్రయాన్‌-1 ప్రాజెక్టుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.500 నుంచి 1000 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. 2024 చివర్లో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికి చేయలేకపోతే.. 2026 లేదా 2028లో చేపట్టే అవకాశం ఉంది. అయితే.. 2031లో చేపడితే ఈప్రాజెక్టు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ..వీటితోపాటు, భారతదేశపు తొలి, డెడికేటెడ్‌ పోలారిమెట్రీ మిషన్‌ ‘ఎక్స్‌పోశాట్‌ (ఎక్స్‌-రే పోలారిమీటర్‌ శాటిలైట్‌)’ ప్రయోగానికి కూడా ఇస్రో సిద్ధంగా ఉంది. రోదసి నుంచి వచ్చే ఎక్స్‌ కిరణాల మూలాలను కనిపెట్టే ప్రాజెక్టు ఇది.