https://oktelugu.com/

ED And CBI: ఈడీ, సీబీఐలతో విపక్షాలను కేంద్రం వేధిస్తోందా?

మనీ లాండరింగ్ కేసులో ఈయనపై ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే 2017 లో ఈయన సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇది బిజెపికి అనుబంధంగా పనిచేయడం మొదలుపెట్టింది. అనంతరం కొంతకాలానికి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 16, 2024 / 10:41 AM IST

    ED And CBI

    Follow us on

    ED And CBI: కవిత అరెస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. ఈడి అధికారులను అడ్డం పెట్టుకొని కేంద్రం విపక్షాల గొంతు నొక్కుతోందనే ఆరోపణలు మళ్లీ మొదలయ్యాయి. ఇంతకీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పై ఈడీ కేసులు నమోదు చేసింది? వారు చేసిన అక్రమాలు ఏంటి? నిజంగానే కేంద్రం ఈడిని అడ్డుపెట్టుకొని విపక్షాల గొంతు నొక్కుతోందా? దీనిపై ప్రత్యేక కథనం

    భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతిపక్ష నాయకులు, వారి సన్నిహితుల పై 95% కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో 0.4 శాతం కేసులు మాత్రమే రుజువైనట్టు తెలుస్తోంది.. మొత్తం నమోదు చేసిన కేసుల్లో 0.5 శాతం కూడా రుజువు కాకపోవడాన్ని.. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది తమ గొంతు నొక్కడమేనని ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బిజెపిలో చేరగానే ఎటువంటి కేసులు ఉండడం లేదని ప్రతిపక్షాలు బలంగా వాదిస్తున్నాయి. ఆ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు కనిపించకుండా పోతున్నాయని చెబుతున్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద 5,960 కేసులు నమోదు చేసింది. ఇందులో ప్రతిపక్ష నాయకులపై 5,150 కేసులు ఉన్నాయి. ఇందులో శిక్ష పడ్డవారు లేదా రుజువైన కేసులో 24 వరకు ఉన్నాయి. గత పది సంవత్సరాలలో సిబిఐ 124 కేసులు నమోదు చేసింది. ఇందులో ప్రతిపక్ష నాయకుల పై 118 కేసులు నమోదయ్యాయి. ఈడి, సిబిఐ ఫైల్ చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులపైనే ఉన్నాయి. వీటిల్లో నేర నిరూపణ జరిగింది 0.42 శాతం మాత్రమే. ఇంకా నేర నిరూపణ జరగనవి లేదా విచారణ దశలో 99.54 శాతం కేసులు ఉన్నాయి.

    కేసులు పెట్టారు.. తర్వాత ఏం జరిగిందంటే..

    నారాయణ్ రాణే

    మనీ లాండరింగ్ కేసులో ఈయనపై ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే 2017 లో ఈయన సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇది బిజెపికి అనుబంధంగా పనిచేయడం మొదలుపెట్టింది. అనంతరం కొంతకాలానికి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019లో తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆయనపై కేసులు ఆగిపోయాయని తెలుస్తోంది.

    సువేందు అధికారి

    ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు. శారదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కుంభకోణంలో ఈయనపై పలు ఆరోపణలు వినిపించాయి. 2014 నుంచి పలుమార్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రశ్నించింది. 2020లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువేందు అధికారి బిజెపిలో చేరారు. ఆ తర్వాత ఆయనపై విచారణ నిలిచిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి.

    హిమంత బిశ్వ శర్మ

    ఈయన కూడా శారద కుంభకోణంలో పలు అభియోగాలు ఎదుర్కొన్నారు. 2014లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన నివాసంపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన 2015లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.

    ముకుల్ రాయ్

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. శారద కుంభకోణంలో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. సిబిఐ ఈయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. దీంతో 2017 లో బిజెపిలో చేరారు. అనంతరం విచారణ నిలిచిపోయింది. 2021 మే నెలలో ముకుల్ రాయ్ కి ఊరట లభించింది. తర్వాత ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    జ్యోతిరాదిత్య సిందియా

    కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయనపై భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. 2020 లో బిజెపిలో చేరగానే ఆయనపై ఉన్న కేసులను మధ్యప్రదేశ్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ మూసివేసింది.

    భావన గవాలీ

    ఠాక్రే శివసేన లో ఉన్నప్పుడు ఈమెను ఈడి వేటాడింది. ఏకంగా ఐదుసార్లు నోటీసులు ఇచ్చింది. దీంతో ఆమె ఏక్ నాథ్ షిండే వర్గం వైపు వెళ్ళిపోయింది. ఎంపీగానూ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చీఫ్ విప్ గా ఉన్నారు. ఒకప్పుడు ఐదు సార్లు నోటీసులు ఇచ్చిన ఈడి.. ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

    యశ్వంత్ యాదవ్

    ఈయన ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ కేసులు పెట్టింది. ఆయన సతీమణి యామిని యాదవ్ పై కూడా పలు అభియోగాలు మోపింది. మహారాష్ట్రలోని షిండే వర్గంలో చేరగానే ఈయనపై ఉన్న కేసులు మొత్తం ఒక్కసారిగా మరుగున పడ్డాయి.

    ప్రతాప్ సర్నాయక్

    శివసేన లో ఉన్నప్పుడు ఈయన మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈడి ఈయనపై కేసు కూడా నమోదు చేసింది.. ఒకానొక దశలో అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత షిండే వర్గంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనపై కేసులు పక్కదారి పట్టాయి.

    సుజనా చౌదరి

    టిడిపికి చెందిన ఈయన పై 2018 నవంబర్లో ఈడి, 2019 జూన్ లో సిబిఐ సోదాలు నిర్వహించాయి. ఆయన కంపెనీలు అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డాయని గుర్తించాయి. అయితే ఆయన ఢిల్లీ వెళ్లి 2019 జూన్ 20న బిజెపిలో చేరారు. దీంతో ఒకసారి గా ఈడి దాడులు ఆగిపోయాయి. సిబిఐ సోదాలు నిలిచిపోయాయి.

    సీఎం రమేష్

    టిడిపికి చెందిన ఈయనపై ఐటి, ఈడీ సంస్థలు దాడులు చేశాయి. దీంతో ఆయన బిజెపిలో చేరారు. ఫలితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలను, దాడులను నిలుపుదల చేశాయి.