PV Narasimha Rao: అది 1992.. జూలై నెల. రాష్ట్రపతిగా వెంకటరామన్ పదవి కాలం త్వరలో ముగియబోతోంది. అప్పుడు పీవీ నరసింహారావు రాష్ట్రపతిని చేసి.. శరద్ పవార్ నుప్రధానమంత్రిని చేస్తారని జోరుగా చర్చలు జరిగేవి. అప్పటికి పివి నరసింహారావు ఏడుపదుల వయసులో ఉన్నారు. పవార్ కు 52 సంవత్సరాల వయసు ఉంది. కాగా అప్పటికే అతడు మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆనాటి ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి 38 మంది కాంగ్రెస్ సభ్యుల తోడ్పాటును శరద్ పవార్ తీసుకున్నారు. అవకాశం ఉంటే వైరి పక్షాన్ని చీల్చగలిగే సత్తా శరద్ పవార్ సొంతం. అయితే భావి ప్రధాని కావడం లో అతడు వేసిన అంచనా పొరపాటయింది. అదే సమయంలో పీవీ నరసింహారావు నిశ్శబ్ద వ్యూహాలు రచించాడు. ఫలితంగా ప్రధానమంత్రి అయ్యాడు.
ప్రధానమంత్రి అయిన తర్వాత శరద్ పవార్ అభ్యర్థి శంకర్ రావు చవాన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. అంతేకాదు ఆయనకు అత్యంత కీలకమైన హోంశాఖ అప్పగించాడు. అలా పివి తన చాకచక్యంతో పవార్ ను మహారాష్ట్రకు పరిమితం చేశాడు. అయితే ఈ వ్యవహారం మొత్తం పీవీ నరసింహారావు అత్యంత నిశ్శబ్దంగా కొనసాగించాడు. తనకు ప్రత్యర్థి అయిన శరద్ పవార్ ను అత్యంత సులువుగా నిలువరించాడు. పవార్ మాత్రమే కాదు అర్జున్ సింగ్, ఫోతే దార్, ఎన్ డీ తివారి, చిదంబరం, రంగరాజన్ కుమార మంగళం, రాజేష్ పైలెట్, మాధవరావు సింధియా.. ఇలా స్వపక్షంలో తనకు వైరి వర్గాలుగా ముద్రపడిన వారందరినీ పివి నరసింహారావు అత్యంత నిశ్శబ్దంగా ఓడించారు.
పీవీ నరసింహారావు రాజకీయ కోవిదుడు. ఆర్థిక శాస్త్ర పితామహుడు. అనేక భాషల మీద పివి నరసింహారావుకు పట్టుంది.. అలాంటి పీవీ తరచుగా.. గంగా తీరం స్వతంత్ర భారత రాజకీయాలను శాసిస్తుంది అని అనేవారు. ఆయన అన్న మాటల ప్రకారం ప్రధమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఇద్దరూ గంగా తీరంలో జన్మించిన వారే. నెహ్రూ స్వస్థలం అలహాబాద్ అయితే.. రాజేంద్రప్రసాద్ పాట్నా నగరవాసి. రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి స్వగ్రామం కూడా అలహాబాదే. ఇక మూడో ప్రధాని ఇందిరాగాంధీ తండ్రి, అతను కూడా అలహాబాదీయులు. మొరార్జీ దేశాయి మాత్రం గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన అనంతరం ప్రధానమంత్రి అయిన చరణ్ సింగ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ఇది కూడా దాదాపు గంగా తీరమే. రాజీవ్ గాంధీ, విశ్వనాథ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ వంటి వారు కూడా అలహాబాద్ ప్రాంతంలో చదువుకున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే గంగా తీర ప్రాంతానికి చెందినవారే దేశ రాజకీయాలను శాసించారు.
వాస్తవానికి పీవీ ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఈ దేశంలో ఎవరికీ కూడా పెద్దగా అంచనాలు లేవు. రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడం… 1990 చివరిలో అయోధ్య వివాదం తలెత్తడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మండల్ కమిషన్ సిఫారసులు అమలు ప్రకటనతో దేశంలో అసంతృప్తి రగిలింది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ సర్కార్ 1990 నవంబర్ తొలి వారంలో పడిపోయింది. ఆ తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయి ఆరు నెలల్లోనే తన రాజీనామా సమర్పించారు . ఇక 1991 జనవరిలో గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది . విదేశీ రుణం చెల్లింపు సమస్య వల్ల మన దేశం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఇన్ని సమస్యలను పీవీ తన చాకచక్యంతో పరిష్కరించ గలిగారు. ఢిల్లీ గడ్డమీద తెలుగువాడి పౌరుషాన్ని చూపారు. కానీ అవసాన దశలో ఆయనకు ఆశించినంత గౌరవం దక్కలేదు. కానీ ఇన్నాళ్లకు బిజెపి ప్రభుత్వం పీవీ నరసింహారావు గొప్పతనాన్ని గుర్తించి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.