Indian Railways: భారతదేశంలో అతిపెద్ద రైలు మార్గం ఉంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎక్కువ శాతం ప్రయాణికులు రైలునే ఆశ్రయిస్తారు. ఇక విదేశాలకు వెళ్లాలంటే మాత్రం ప్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కాలంటే చార్జీలు అధికంగా ఉంటాయి. అయితే కొన్ని దేశాలకు వెళ్లాలంటే విమానం ఎక్కాల్సిన పనిలేదు. రైలులో కూడా జర్నీ చేయొచ్చు. రైలులో ప్రయాణించాలన్నా అందుకు సంబంధించిన పాస్ పోర్టు ఉండాలి. భారతదేశం నుంచి కొన్ని దేశాలకు రైలు మార్గాలు ఉన్నాయి. కొన్ని రోజులు వీటిలో కొన్ని నిషేధించబడినా.. ప్రస్తుతం పున: ప్రారంభం అయ్యాయి. మరి ఆ రైళ్ల వివరాలేంటో చూద్దామా.
భారత దేశానికి సరిహద్దులో పలు దేశాలున్నాయి వీటిలో నేపాల్, బంగ్లాదేశ్ లతో రైలు సంబంధాలు కలిగి ఉన్నాయి. నేపాల్ వెళ్లాలనుకునేవారు ఫ్లైట్ లోనూ వెళ్లొచ్చు. ఈ దేశానికి వీసా అవసరం లేదు. అలాగే రైలు మార్గంలోనూ జర్నీ చేయొచ్చు. బీహార్ లోని మధుబని జిల్లాలోని జయనగర్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్లు వెళ్తాయి. ఈ స్టేషన్ జనక్ పూర్ వద్ద కుర్తా స్టేషన్ ద్వారా నేపాల్ కు అనుసంధానించారు. ఇది కొన్నిరోజుల పాటు నిలిచిపోయింది. ఇటీవలే పునరుద్దరించారు.
దేశానికి సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ కు వెళ్లాలంటే పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా స్టేషన్ నుంచి ‘బంధన్ ఎక్స్ ప్రెస్’ బయలుదేరుతుంది. ఇది ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని పెట్రాపోల్ రైల్వేస్టేషన్ లో కూడా ఆగుతుంది. అయితే ఈ రైలులో ప్రయాణించాలంటే సంబంధిత పాస్ పోర్టు అవసరం ఉంటుంది.
బంగ్లాదేశ్ కు వెళ్లాలనుకునేవారికి మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. అదే ‘మిథాలి ఎక్స్ ప్రెస్’. న్యూజల్ పై గురి జంక్షన్ నుంచి హల్దీబారి, చిల్లతి నుంచి బంగ్లాదేశ్ వరకు వెల్తుంది. రాధికాపూరి రైల్వేస్టేషన్ నుంచి బంగ్లాదేశ్ లోని బిరల్ స్టేషన్ వరకు మరో రైలు వెళ్తుంది. ఇది ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో యాక్టివ్ ట్రాన్సిట్ స్టేషన్ గా పనిచేస్తుంది. ఈ సరిహద్దు రైల్వే స్టేషన్ సాధారణంగా అస్సాం, బీహార్ నుంచి వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగస్తారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాలోని సింగాబాద్ రైల్వేస్టేస్ నుంచి కూడా బంగ్లాదేశ్ కు అనుమతించిన రైల్వేలైన్స్ ఉన్నాయి. పాత మాల్దా స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ వరకు ఇది ప్రయాణిస్తుంది. ప్యాసింజర్ తో పాటు గూడ్స్ రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తాయి.