India Original Name Story: ఇండియా అన్నది బ్రిటిష్ వారు పెట్టిన పేరు అని.. త్వరలో దానిని భారత్ అని మార్చనున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ అత్యవసర సమావేశాలు నిర్వహించి ఇండియను.. భారత్ గా మారుస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎక్కువమంది ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. చాలామంది ఆహ్వానిస్తున్నారు. ఇండియా పేరు మారుతున్న నేపథ్యంలో.. అసలు ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏ పేర్లు ఉన్నాయి? అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
భరతవర్ష, భరత్ అనేది పురాణ కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబుద్వీప, నబీవర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం మెస్పుటోమియా నాగరికత కాలంలో లభించిన రాతలు సింధు నాగరికత విలసిల్లిన ప్రస్తుత భారత ఉపఖండాన్ని మెలూహాగా పేర్కొన్నట్లు చరిత్రకారులు చెబుతారు. రాజకీయ చరిత్రలో మాత్రం దీనికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. భరతవర్ష, భారత్ మాత్రమే తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి.
మధ్యలో హిందూస్తాన్ అన్న పదం బలంగా వినిపించింది. పర్షియన్ల రాకతో హిందూ అన్న పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తు పురం ఏడో శతాబ్దిలో సింధులోయను స్వాధీనం చేసుకున్న పర్షియన్లు సింధు నదిని హిందువుగా పలికే వారట. క్రీస్తు శకం ఆరంభంలో దీనికి పరిషియన్ పదం స్థాన్ తోడై హిందుస్థాన్ గా మారిందని ఒక ప్రచారం ఉంది. బ్రిటిష్ వారి ఆగమనంతో హిందుస్థాన్ కాస్త ఇండియా గా మారిందని.. ఆంగ్లేయులు ఇండియా పేరును పటాల్లో, అధికార పేర్లలో ఖాయం చేశారు. స్వాతంత్రం వచ్చాక సైతం దేశం పేరుపై తర్జనభర్జనలు జరిగాయి. ఇండియా గానే ఉంచాలని కొందరు.. విదేశీయులు పెట్టిన పేరును ఉంచొద్దని మరికొందరు బలమైన వాదనలు వినిపించారు. చివరకు ఎవరినీ నొప్పించక ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇండియా, భారత్ పేర్లను కొనసాగించారు.
అయితే ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. 2012లో కాంగ్రెస్ సభ్యుడు శాంతారాం నాయక్ పార్లమెంట్లో ఏకంగా బిల్లునే ప్రవేశపెట్టారు. 2014లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా ఉండేటప్పుడు ఇలాంటి డిమాండ్ తోనే ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం కొందరు ఆశ్రయించారు. ఇండియన్ భారత్ గా మార్చాలని కోరారు.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సదస్సు ఆహ్వాన పత్రికలో భారత్ అని సంబోధించి కొత్త చర్చకు కారణమైంది.