Himachal Pradesh: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకతప్పదా?

హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేశారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహా జన్ కు ఓటు వేశారు.

Written By: Suresh, Updated On : February 29, 2024 6:58 pm
Follow us on

Himachal Pradesh: శీతల రాష్ట్రంగా పేరు పొందిన హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో హైడ్రామా కొనసాగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ను కాదని విపక్ష అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. గురువారం వారి సభ్యత్వం రద్దు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పిటిషన్ వేసిన నేపథ్యంలో స్పీకర్ కులదీప్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుజన్ పూర్ ఎమ్మెల్యే రాజేందర్ రాణా, కుతులహర్ ఎమ్మెల్యే దేవేందర్ కుమార్ భుట్టో, లవ్హాల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్రదత్.. సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలలో ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేశారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహా జన్ కు ఓటు వేశారు. అయితే వీరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అంతేకాదు వారికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజ్యసభలో బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతానికి వెళ్లిపోయారు. వారు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వ్యక్తిగత సిబ్బందిని కూడా హిమాచల్ ప్రదేశ్ పంపించి.. కేవలం వారు మాత్రమే పంచకుల వెళ్లారు.

పంచకుల ప్రాంతానికి వెళ్లిన ఆ 9 మంది ఎమ్మెల్యేలకు అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. బుధవారం తెల్లవారుజామున వరకు ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బయట ప్రపంచానికి కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక హెలికాప్టర్లో వారు బుధవారం ఉదయం 9 గంటలకు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా బిజెపి ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీ నిరూపించుకోవాలని.. అప్పుడే బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తామని బిజెపి ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. దీంతో ఆ రాష్ట్ర శాసనసభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ గొడవ మధ్యే స్పీకర్ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయిన తర్వాత మూజువాణి పద్ధతిలో బడ్జెట్ కు శాసనసభ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ఆమోదం తర్వాత శాసనసభ స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయనుకుంటున్న తరుణంలో హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో పడేశాయి.

ఇక ఈ పరిణామాల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మొట్టమొదటిసారి స్పందించారు. రాజకీయ సంక్షోభం అనేది బిజెపి సృష్టిస్తోందని.. కానీ ఎట్టి పరిస్థితిలో తాను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని ప్రకటించారు. బిజెపి ఆగడాలు ఎదుర్కొని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తామని ఆయన ప్రకటించారు. శాసనసభలో బిజెపి ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించారో అందరూ చూశారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 స్థానాలు గెలుచుకుంది.. బిజెపి 25 ఎమ్మెల్యే స్థానాలతో సరిపుచ్చుకుంది. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్ విప్ నిర్ణయం మేరకు స్పీకర్ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ బలం 34కు పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా? లేక వదిలేస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది